మహిళా భద్రత చట్టం ముసాయిదా బిల్లులో మార్పులు?

26 Nov, 2014 02:54 IST|Sakshi

* పలు సూచనలు చేస్తూ  మళ్లీ డీజీపీ, నగర సీపీకి పంపిన రాష్ట్ర హోంశాఖ
* పురుషుడి జేబులో ఎవరైనా మహిళ ఫొటో ఉన్నానేరమనడంపై అభ్యంతరం
* నిర్భయ చట్టంలాగే, దీనిపైనా విస్తృత చర్చ జరగాల్సిందేనన్న కమిటీ సభ్యులు

 
 సాక్షి, హైదరాబాద్:  మహిళల భద్రతపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు రూపొందించిన చట్టం ముసాయిదా బిల్లుపై  వారిస్థాయిలోనే  భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ చట్టంలో కొన్ని నిబంధనల పట్ల రాష్ట్ర హోంశాఖ  ముఖ్య కార్యదర్శి  అజయ్ మిశ్రా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ చట్టంపై నిర్భయ చట్టంలాగే విస్తృతస్థాయి చర్చ జరగాలని  రాష్ట్ర మహిళా భద్రతా కమిటీకి చెందిన కొందరు సభ్యులు  సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చట్టం ముసాయిదాలో కొన్ని మార్పులు సూచిస్తూ  రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిలకు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ఈ బిల్లును పంపించింది.  రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా  రాష్ట్రంలో కొత్తగా మహిళా భద్రతా చట్టం  ముసాయిదాను సీపీ మహేందర్‌రెడ్డి రూపొందించారు. ఈ మేరకు ఆది వారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై కూడా చర్చించారు.
 
  కాగా, ఈ ముసాయిదాలో కొన్ని అంశాలు స్పష్టంగా లేవని, దీనివల్ల న్యాయపరంగా చిక్కులెదురవుతాయని రాష్ట్ర హోంశాఖతోపాటు కొందరు కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిసింది. ఈవ్ టీజింగ్, మహిళలపై  వేధింపుల విషయాల్లో ఎవరు నేరస్తులవుతారు? దానికి తగిన ఆధారాలేమిటనే విషయంలో స్పష్టత లేదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం.. పురుషుడి జేబులో ఎవరైనా మహిళ ఫొటో ఉన్నా.. అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తారనే నిబంధనపై రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. నిజానికి కొందరు తమకిష్టమైన సినీ హీరోయిన్ల ఫొటోలు పెట్టుకుంటారని, మరికొందరు ఫేస్ బుక్‌లో తమకు నచ్చిన వారి ఫొటోను పెట్టుకుంటారని, వీరందర్నీ నిందితులుగా ఎలా పేర్కొంటారని,  అలా చేయడం వలన వాళ్లు తప్పు చేసినట్లుగా ఎలా గుర్తిస్తారని అడిగినట్లు సమాచారం.
 
 ఇలాంటివే మరికొన్ని సున్నిత అంశాలున్నాయని వీటిపై లోతుగా అధ్యయనం చేయాలని పలువురు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈవ్‌టీజింగ్‌పై  తమిళనాడులో అమల్లో ఉన్న చట్టాన్ని ఆధారంగా చేసుకుని మహిళాభద్రత చట్టం రూపొం దించడం బాగానే ఉందనీ, దీనికి ముందు జాతీయస్థాయిలో నిర్భయ చట్టంలాగే దీనిపైనా చర్చ జరగాలని వారు సూచిం చినట్లు సమాచారం.  దీంతో న్యాయపరంగా సమస్యలు తలెత్తవని, మరోవైపు మరింత కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారన్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హోంశాఖ  వెనక్కి పంపించిన తాజా చట్టం ముసాయిదాపై డీజీపీ, సీపీ అవసరమైన  మార్పులు చేర్పులు  చేసి తిరిగి రాష్ట్ర న్యాయశాఖ పరిశీలనకు పంపిస్తారనీ,  అనంతరం  సీఎం  కేసీఆర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని కేంద్ర హోంశాఖ ఆమోదం కోసం పంపిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు