కాల్వలు దాటడం కష్టమే!

8 Mar, 2019 16:02 IST|Sakshi
సయ్యద్‌నగర్‌లో దాటేందుకు కాల్వపై చెక్కలు, రాళ్లు

సాక్షి, అమరచింత(వనపర్తి) : అమరచింత మున్సిపాలిటీ ఏర్పడక ముందే గ్రామపంచాయతీలో కొత్తగా నిర్మించిన మురుగు కాల్వలపై అవసరం ఉన్నచోట స్లాబ్‌లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు, చిన్నారులు మురుగు కాల్వలు దాటే క్రమంలో కిందపడి గాయపడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనదారులతో పాటు రిక్షాలు కూడా కాలనీ, వీధుల్లో వెళ్లలేని దుస్థితి నెలకొంది.


పాతకల్లుగేరిలో స్లాబ్‌లేని మురుగు కాల్వ

 
రూ.16లక్షలతో నిర్మాణం.. 
అమరచింత మున్సిపాలిటీలోని ఆయా వీధులలో సుమారు రూ.16లక్షల వ్యయంతో 7 చోట్ల మురుగు కాల్వల నిర్మాణం పనులను చేపట్టారు. ప్రస్తుతం సదరు కాంట్రాక్టర్‌ బిల్లులను చెల్లించకపోవడంతో నిర్మించిన కాల్వలపై స్లాబ్‌లను ఏర్పాటు చేయడం మర్చిపోయారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారని ఆయా కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.


స్లాబులు వేస్తేనే ప్రయోజనం.. 
అమరచింత మున్సిపాలిటీలోని సయ్యద్‌నగర్, రాణాప్రతాప్‌నగర్, ఆజాద్‌నగర్, శివాజీనగర్‌తో పాటు మరికొన్ని కాలనీల్లో రూ.16లక్షల వ్యయం తో కూడిన మురుగు కాల్వల నిర్మాణ పనులను మాజీ సర్పంచ్‌ పురం వెంకటేశ్వర్‌రెడ్డి హయాంలో నిర్మించారు. ప్రస్తుతం 7 కాల్వల నిర్మాణాలతో పా టు రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా నూతనంగా డ్రెయినేజీ పనులను సుమారు రూ.20లక్షలవ్యయంతో నిర్మించారు. గతంలో నిర్మిచిన మురుగు కాల్వల నిధులతోపాటు ప్రస్తుతం నూతనంగా ని ర్మించిన కాల్వల పనులకు కూడా బిల్లులు రాలేదని అవసరం ఉన్న చోట్ల కాల్వలపై స్లాబ్‌లను ఏర్పాటుచేయలేక పోతున్నారు. అధికారులు స్పందించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించి మురుగు కాల్వలపై వెంటనే స్లాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు