'జంట'లో..కాలుష్య మంట

25 Feb, 2020 11:05 IST|Sakshi

వందేళ్ల జలాశయాలకు మురుగు ముప్పు

విష కాసారాలుగా మారుతున్న గండిపేట్, హిమాయత్‌సాగర్‌

11 గ్రామాల మురుగు..పలు కళాశాలల వ్యర్ధాలు జంట జలాశయాల్లోకే..

ఎస్టీపీల నిర్మాణానికి నిధుల విడుదలపై నిర్లక్ష్యం

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక జంట జలాశయాలకు మురుగు నీరు శాపంగా మారింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ తాగునీటి తటాకాలను సమీప గ్రామాలు, ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి వచ్చి కలుస్తోన్న మురుగు జలాలు కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నాయి. నిత్యం సుమారు 1.50 కోట్ల లీటర్ల వ్యర్థజలాలు జలాశయాల్లో కలుస్తున్న నేపథ్యంలో ఆయా కళాశాలలు, గ్రామపంచాయతీల పరిధిలో మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించుకోవాలని జలమండలి, పీసీబీలు ఆయా కళాశాలలకు గతంలో నోటీసులు జారీచేశాయి. ఇదే అంశంపై హైకోర్టు కూడా కళాశాలల యాజమాన్యాలు ఎస్టీపీలను నిర్మించుకోవడం ద్వారా జలాశయాలను కాలుష్యకాసారం కాకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ ఏళ్లుగా ఈ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం జలాశయాల పాలిట శాపంగా మారింది. కాగా ఈ జలాశయాలకు సమీపంలోని 11 గ్రామాల పరిధిలో ఎస్టీపీల నిర్మాణానికి పంచాయతీరాజ్‌ విభాగం రూ.27.50 కోట్లు, పీసీబీ     నిధులు రూ.13 కోట్ల విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

జి.ఓ.111కు అడుగడుగునా తూట్లు
జలాశయాలను పరిరక్షించే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం జారీచేసిన జి.ఓ.111కు అడుగడుగునా అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రధానంగా ఈ జి.ఓ. వర్తించే గండిపేట్, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో పలు అక్రమాలను గతంలో రెవెన్యూ, జలమండలి, పీసీబీ విభాగాలు గుర్తించాయి. ఎగువ ప్రాంతాల్లో సుమారు 340 ఎకరాలు కబ్జాకు గురయినట్లు రెవెన్యూ విభాగం లెక్కతేల్చింది. ఇక జలాశయాల్లోకి వరదనీటి చేరికను నిరోధించేలా ఇసుక క్వారీలు తవ్వేయడం, ఇటుకబట్టీల కోసం భారీగా కందకాలు తవ్వడం, రియల్‌ వెంచర్లు, బహుళ అంతస్థుల భవంతులు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఫాంహౌజ్‌లు నిర్మించడంతోపాటు వాటి చుట్టూ కోటలవలె అత్యంత ఎత్తున కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రహారీలు నిర్మించడంతో జలాశయాల్లో వరదనీరు చేరే జాడలేక అవి రోజురోజుకూ చిన్నబోతున్నాయి. 

మురుగుతో కాలుష్యం ముప్పు..
సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వెలువడుతోన్న మురుగునీరు యధేచ్ఛగా ఈ జలాశయాల్లోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మించాలని గతంలో ప్రభుత్వం సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో రూ.27.50 కోట్లు పంచాయతీరాజ్‌ శాఖ, మరో 13 కోట్లు కాలుష్య నియంత్రణ మండలి నిధులు కేటాయించాలని ఆదేశించింది. కానీ ఐదేళ్లుగా ఆయా విభాగాలు పైసా నిధులు విదిల్చకపోవడంతో సమీప గ్రామాల మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జలాశయాల్లో కలుస్తుండడంతో స్వచ్ఛమైన తాగునీటితో కళకళలాడే జలాశయాలు ఆర్గానిక్‌ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి.

ఘనచరిత్ర ఇదీ...
అది...1908 సంవత్సరం..సెప్టెంబరు 28 మూసీనది నగరంపై కన్నెర్ర జేసింది. ఎగువన కురిసిన కుండపోత వర్షానికి నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. ప్రశాంతమైన నది ఒక్కసారిగా మహోగ్రరూపం దాల్చింది. జలవిలయంతో చారిత్రక భాగ్యనగరం అల్లాడింది. సగానికి పైగా నగరం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ దుస్థితి చూసి నాటి నిజాం ప్రభువు ఉస్మాన్‌ అలీఖాన్‌ కలత చెందారు. మూసీ వర దలకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న అంశంపై నిపుణులతో సుదీర్ఘకాలం సమాలోచనలు జరిపారు. అప్పటికే మైసూరు,బొంబాయి సంస్థానాల్లో అద్భుతమైన ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో తనదైన ముద్ర వేసిన సుప్రసిద్ధ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ పరిస్థితికి చక్కని పరిష్కారం చూపుతారని భావించారు. తన ఆలోచనను ఆయన ముందుంచారు. విశ్వేశ్వరయ్య ప్రభువు కోరికను మన్నించారు. 1910, 1912 ప్రాంతంలో మూసీ ఎగువ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు.

సుమారు 46 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో రెయిన్‌గేజ్‌ యంత్రాలను ఏర్పాటుచేసి వర్షపాతాన్ని శాస్త్రీయంగా అంచనా వేశారు. భారీ వర్షాలు కురిసినపుడు 4,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం మూసీలో చేరుతుందని లెక్కగట్టారు. ఉస్మాన్‌సాగర్‌(గండిపేట్‌), దానిపక్కనే హిమాయత్‌సాగర్‌ జలాశయాలను ఏర్పాటుచేయాలని నిజాం రాజుకు సూచించారు. ఆయన చొరవ, దార్శనికత కారణంగానే 1920లో గండిపేట్‌(మూసీ),1927లో హిమాయత్‌సాగర్‌(ఈసీ)జంట జలాశయాల నిర్మాణం జరిగింది. ఓ స్వప్నం సాకారమైంది. ఈ జలాశయాల్లో నిల్వచేసిన మంచి నీటిని హైదరాబాద్‌ నగర దాహార్తిని తీర్చేందుకు గ్రావిటీ ద్వారా తరలించేందుకు వీలుగా డిìజైన్, డ్రాయింగ్‌ సిద్ధంచేశారు. నీటిని శుద్ధిచేసేందుకు వీలుగా మీరాలం ఫిల్టర్‌బెడ్‌కు è చక్కటి డిజైన్‌ సిద్ధంచేశారు. జంట జలాశయాలకు ఫ్లడ్‌గేట్లను ఏర్పాటు చేశారు. రాజధాని నగరానికి వరద తాకిడి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించారు. తక్కువ ఖర్చుతోనే ఈ బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆయన ఇంజినీరింగ్‌ ప్రతిభకు తార్కాణం. నాడు ఐదు లక్షల మంది నగర జనాభాకు మంచినీరు అందించేందుకు ఏర్పాటుచేసిన జంట జలాశయాలు నేటికీ రాజధాని దాహార్తి తీరుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీగా 20 మిలియన్‌ గ్యాలన్ల మంచినీటిని ఈజలాశయాల నుంచి సేకరిస్తుండడం విశేషం.

జంట జలాశయాలనుపరిరక్షించాలి
జంట జలాశయాలను కాలుష్యం బారి నుంచి రక్షించాలి. వీటి వద్ద టూరిజం, రిక్రియేషన్‌ సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో మానవ కార్యకలాపాలు పెరిగి ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా కుంచించుకుపోయి గరళ సాగరంగా మారడం తథ్యం. ఈ జలాశయాల పరిరక్షణకు హైకోర్టు సూచనల మేరకు నిపుణులతో లేక్‌ ప్రొటెక్షన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. సమీపంలో ఉన్న 42 ఇంజినీరింగ్‌ కళాశాలలు తక్షణం మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలు నిర్మించుకోవాలి.  జలాశయాల ఎగువన అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, రియల్‌ వెంచర్లను తక్షణం తొలగించాలి. కబ్జాల చెర నుంచి కాపాడాలి. ఈ జలాశయాలు పూర్వపు స్థాయిలో జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుంది.  – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త

ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు..వాటి సామర్థ్యం ఇదీ
ఉస్మాన్‌సాగర్‌(గండిపేట్‌ జలాశయం పరిధిలో)
ఖానాపూర్‌– 0.6 మిలియన్‌ లీటర్లు
వట్టినాగులపల్లి–0.8  
జన్వాడ– 0.6  
అప్పోజిగూడా– 0.1
చిలుకూరు– 0.7
బాలాజీ దేవాలయం– 0.1
హిమాయత్‌నగర్‌– 0.3
హిమాయత్‌సాగర్‌ పరిధిలో...
హిమాయత్‌సాగర్‌–0.25 మిలియన్‌ లీటర్లు
అజీజ్‌నగర్‌–0.9 మిలియన్‌ లీటర్లు
ఫిరంగినాలా–2.9 మిలియన్‌ లీటర్లు
కొత్వాల్‌గూడా– 0.3 మిలియన్‌ లీటర్లు

మరిన్ని వార్తలు