తేజస్, శక్తి..దేశానికి గర్వకారణం

29 Apr, 2019 03:13 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జి.సతీశ్‌రెడ్డి

డీఆర్‌డీవో డైరెక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణ రంగంలో గతేడాది అత్యంత కీలకమైన రెండు ఘటనలు చోటుచేసుకున్నాయని, భారత్‌ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఘటనలు ఎంతో దోహదపడ్డాయని డీఆర్‌డీవో డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి అన్నారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌.. అన్ని అనుమతులు సంపాదించుకుని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో తయారీకి సిద్ధమవడం యుద్ధ విమానాల రంగంలో మనం సాధించిన అతిగొప్ప విజయమని పేర్కొన్నారు. దీంతోపాటు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాన్ని అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టి నాశనం చేయగల టెక్నాలజీ (మిషన్‌ శక్తి) కూడా మన సాంకేతిక పరిజ్ఞాన పటిమకు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.

ఆదివారం సాయంత్రం ఏరోనాటికల్‌ సొసైటీ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భూమికి సుమారు 283 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహ కేంద్ర బిందువును 10 సెంటీమీటర్ల తేడాతో క్షిపణితో ఢీకొట్టడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ టెక్నాలజీ అభివృద్ధికి రెండేళ్ల క్రితం అనుమతులు మంజూరు చేస్తే.. డీఆర్‌డీవోలోని అన్ని విభాగాల శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు చిత్తశుద్ధితో రేయింబవళ్లు పనిచేయడం ద్వారా విజయవంతమయ్యామని వివరించారు. 

50 కంపెనీలు పనిచేశాయి... 
మిషన్‌ శక్తిపై అంతర్జాతీయ సమాజం దృష్టి పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో రహస్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టిందని ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజబాబు తెలిపారు. మిషన్‌ ఉద్దేశం ఏమిటో ఇతరులకు తెలియకూడదన్న లక్ష్యంతో క్షిపణి, ఇతర టెక్నాలజీల పనులను దేశంలోని 50 కంపెనీలకు పంపిణీ చేశామని ‘మిషన్‌ శక్తి’పై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వివరించారు. ఉపగ్రహ విధ్వంస క్షిపణి సెకనులో వందో వంతులోనూ లక్ష్యాన్ని గుర్తించి అందుకు తగ్గట్టుగా దిశ, వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేయడం సవాలేనని అన్నారు. పేలుడు సందర్భంగా అంతరిక్షంలోకి చేరిన శకలాలు అన్నీ వారాల వ్యవధిలో నశించిపోతాయన్నారు.

దేశ అవసరాలకు ప్రత్యేకంగా ఒక మైక్రోప్రాసెసర్‌ ఆర్కిటెక్చర్‌ను సిద్ధం చేసేందుకు ఐఐటీ మద్రాస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఐఐటీ మద్రాస్‌ అధ్యాపకుడు కామకోటి అన్నారు. ఇంటర్నెట్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ పరికరాలు మొదలుకొని సూపర్‌ కంప్యూటర్ల వరకూ అవసరమైన మైక్రోప్రాసెసర్లను ఈ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా తయారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ రామ్‌గోపాలరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు