సాగర మథనం..

19 Aug, 2017 02:02 IST|Sakshi
సాగర మథనం..

గ్రేటర్‌ తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా జలమండలి చర్యలు
డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా పుట్టంగండి వద్ద కాల్వ తవ్వకం
► నీటిలోనే భారీ యంత్రాలతో తవ్వకం సాగిస్తున్న సిబ్బంది
► రాతి నేలను తొలిచేందుకు అనేక వ్యయప్రయాసలు
► మరో వారం రోజుల్లో సాగర మథనం పూర్తయ్యే అవకాశం


సాక్షి, హైదరాబాద్‌
గ్రేటర్‌ తాగునీటి అవసరాలకు తరలిస్తున్న కృష్ణా జలాలకు ఎలాంటి ఢోకా లేకుండా చూసేందుకు జలమండలి చేపట్టిన ‘సాగర మథనం’కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తికానుంది. నగర తాగునీటి అవసరాలకు ప్రస్తుతం నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌(పుట్టంగండి) నుంచి నిత్యం కృష్ణా మూడు దశల ప్రాజెక్టు ద్వారా 270 మిలియన్‌ గ్యాలన్ల జలాలను అక్కంపల్లి జలాశయానికి తరలించి అక్కడి నుంచి నగరానికి పంపింగ్‌ చేస్తున్నారు. సాగర్‌లో గరిష్ట నీటిమట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం నీటిమట్టం 500.300 అడుగులకు చేరింది. దీంతో పుట్టంగండి వద్ద ఇప్పటికే నీటితో ఉన్న కాల్వను 485 అడుగుల లోతు వరకు డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా తవ్వి.. అత్యంత లోతు నుంచి రెండో దశ అత్యవసర పంపింగ్‌ ద్వారా నీటిని సేకరించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రుతుపవనాలు ఆలస్యమైనా మరో 45 రోజుల వరకూ నగరానికి తరలిస్తున్న కృష్ణా జలాలకు కోత పడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అక్కంపల్లిలో అరకొర నిల్వలే..
ప్రస్తుతం పుట్టంగండి నుంచి రోజువారీగా జలమండలి 700 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి నగర తాగునీటి అవసరాలకు పంపింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ జలాశయంలో నీటినిల్వలు 0.193 మీటర్లకు చేరుకున్నాయి. ఈ నిల్వలు రెండు రోజుల నగర తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటడం.. సాగర్‌లో నీటిమట్టాలు రోజురోజుకూ పడిపోతుండటం, ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

రాతి నేలను తొలిచేందుకు వ్యయప్రయాసలు..
పుట్టంగండి వద్ద అత్యవసర పంపింగ్‌ మోటార్లు ఏర్పాటు చేసిన చోటు నుంచి కిలోమీటర్‌ పొడవునా నీటిలో డ్రెడ్జింగ్‌ ప్రక్రియను ధర్తీ ఇన్‌ఫ్రా అనే సంస్థ అనేక వ్యయప్రయాసలకోర్చి చేపడుతోంది. ఈ కాల్వను 19 మీటర్ల వెడల్పు, 15 అడుగుల లోతున నీటిలోనే ఏర్పాటు చేస్తున్నారు. నీటి అడుగున రాతినేల కావడం, బ్లాస్టింగ్‌కు అనుమతి లేకపోవడంతో భారీ హిటాచీ యంత్రాలతో కాల్వను తవ్వుతున్నారు. ఈ క్రమంలో యంత్రాల దంతాలు, హోస్‌పైప్‌లు దెబ్బతింటున్నాయని పనులు చేపట్టిన సంస్థ చెబుతోంది. అయినప్పటికీ పనులను నిరాటంకంగా సాగిస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సాగర్‌ గర్భంలో రాతినేలను తొలిచి కాల్వను తవ్వేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నామన్నారు.

గ్రేటర్‌కు కృష్ణా.. గోదావరి జలాలే ఆధారం..
జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ నుంచి నీటిసరఫరా నిలిచిపోవడం, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి సగానికిపైగా నీటిసరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుతం నగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ఎల్లంపల్లి(గోదావరి) నుంచి 114 మిలియన్‌ గ్యాలన్లు, అక్కంపల్లి(కృష్ణా) నుంచి 270 మిలియన్‌ గ్యాలన్లు, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 48 ఎంజీడీలు మొత్తంగా రోజుకు 432 ఎంజీడీల నీటిని గ్రేటర్‌ తాగునీటి అవసరాలకు జలమండలి తరలిస్తోంది.

తాగునీటికి ఢోకా లేకుండా పటిష్ట చర్యలు
గ్రేటర్‌ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. డ్రెడ్జింగ్‌ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి కృష్ణా జలాలకు కొరత లేకుండా చూస్తాం. రుతుపవనాలు ఆలస్యమైనా 9.65 లక్షల నల్లాలకు కొరత లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. పట్టణ మిషన్‌ భగీరథ పథకంతో గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో రూ.1,900 కోట్ల హడ్కో నిధులతో వంద రోజుల రికార్డు సమయంలో 1,200 కి.మీ పైపులైన్లు ఏర్పాటు చేసి సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల దాహార్తిని దూరం చేశాం. ఔటర్‌లోపలున్న 183 పంచాయతీలు, 7 నగర పాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.628 కోట్లతో రిజర్వాయర్లు, పైప్‌లైన్‌ పనులను మొదలుపెట్టాం. ఏడాదిలో ఈ ప్రాంతాల దాహార్తిని కూడా దూరం చేస్తాం.
                                                                          – ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌

నగర దాహార్తిని తీరుస్తోన్న జలాశయాల్లో శుక్రవారం నాటికి నీటిమట్టాలిలా ఉన్నాయి.. (అడుగుల్లో..)
జలాశయం                     గరిష్టమట్టం        ప్రస్తుతమట్టం
నాగార్జునసాగర్‌                 590        500.300
ఎల్లంపల్లి(గోదావరి)          485.560        473.060
సింగూరు                      1,717.932        1,708.712
మంజీరా                      1,651.750        1,647.400

మరిన్ని వార్తలు