స్వీట్‌ బాక్సుల్లో రూ.1.48 కోట్లు

21 Aug, 2019 01:37 IST|Sakshi

విమానాశ్రయంలో పట్టుబడిన విదేశీ కరెన్సీ

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమంగా రవాణా చేస్తున్న దుబాయ్‌ కరెన్సీని డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. కరెన్సీని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణాపై విశ్వసనీయ సమాచారం అందడంతో డీఆర్‌ఐ అధికారులు సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న మిఠాయి బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్‌ లభించాయి. అలాగే ఎయిరిండియా విమానం నుంచి దిగిన మరో ప్రయాణికుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న ఉస్మానియా బిస్కెట్‌బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్‌ లభించాయి. భారత కరెన్సీలో వీటి విలువ రూ.1,48,75,000 గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరు ఈ మొత్తాన్ని దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీని తరలిస్తున్నందుకు వీరిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు