తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని..

25 Dec, 2014 03:44 IST|Sakshi
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని..

మూడు ముళ్లు వేసి బంధం ఏర్పర్చుకున్నాడు.. ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు.. కాపురానికి తీసుకెళ్లి నరకం చూపా డు.. భరించలేక అప్పుడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది... ఆ ఇల్లాలు. స్థానికుల సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడి పుట్టింటికెళితే.. మారానంటూ పంచన చేరాడు.. తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని చివరకు ఉన్మాదిలా మారి ఆలినే అంతమొందించాడు.     -పెద్దవూర
 
* భార్యను కడతేర్చిన భర్త
* మద్యం మత్తులోనే ఘాతుకం
* పెద్దవూర మండలం చలకుర్తిలో దారుణం

పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన కంపసాటి వెంకటేశ్వర్లు-నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో మూడవ సంతానమైన యాదమ్మ(30)ను పదిహేనేళ్ల క్రితం అనుముల మండలం బోయగూడెం గ్రామానికి చెందిన కట్టెబోయిన సంజీవకు ఇచ్చి వివాహం జరి పించారు. వివాహం అయిన ఐదు సంవత్సరాల వరకు యాదమ్మ(30) అత్తగారి ఊరైన బోయగూడెంలోనే కాపురం చేసింది.

ఈ క్రమంలో సంజీవ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో ఘర్షణ పడి కొట్టేవాడు. దీనిని భరించలేక యాదమ్మ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను కాపాడారు. భర్త చిత్రహింసలు భరించలేక తల్లిగారి ఊరైన చలకుర్తికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఏడాది తరువాత భర్త సంజీవ పెద్ద మనుషుల సమక్షంలో చలకుర్తికి వచ్చాడు. మద్యం ముట్టనని నమ్మబలికి తొమ్మిదేళ్లుగా భార్యవద్దే ఉంటున్నాడు. యాదమ్మ కూలి పనులకు వెళ్తుండగా సంజీవ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు దీపిక, కుమారుడు జన్మించారు.
 
మూడేళ్లుగా చిత్రహింసలే..
మూడేళ్లుగా సంజీవ మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా భార్యను వేధిస్తూ కూలిచేస్తే వచ్చిన డబ్బును తాగుడుకు తగలేసేవాడు. అప్పట్లో యాదమ్మ కూలి పనులు చేస్తూ కూడబెట్టిన డబ్బుతో మేకలను కొనుగోలు చేసి పొద్దంతా వాటిని మేపటానికి వెళ్తోంది. రోజూలాగే బుధవారం మేకలను మేపటానికి చలకుర్తి క్యాంపు సమీపంలోని పోతులకుంటకు వెళ్లింది.  పాఠశాలకు సెలవు ఉండటంతో  కూతురు దీపికను తోడుగా తీసుకె ళ్లింది.
 
ఘర్షణ పడి.. కర్రతో తలపై కొట్టి..
సంజీవ మధ్యాహ్న సమయంలో పూటుగా మద్యం సేవించి పోతులకుంట వద్దకు వచ్చా డు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆపై కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందింది. అక్కడే ఉన్న కూతురు దీపిక ఏడ్చుకుంటూ సమీపంలోని పంటచేలో ఉన్న తన అమ్మమ్మ వద్దకు పరుగు పెట్టగా క ర్రతో వెంబడించాడు.

చుట్టు పక్కల వాళ్లు వచ్చి చూసేసరికి అప్పటికే యాదమ్మ మృతిచెందింది.  హాలియా సీఐ పార్థసారథి, ఎస్‌ఐ ఇండ్ల వెంకటయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటయ్య తెలిపారు.

>
మరిన్ని వార్తలు