ప్రతిపల్లెకూ తాగునీరు

29 Sep, 2014 01:24 IST|Sakshi

గద్వాల: కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డలో తాగునీటి కష్టాలకు ఇక చెక్ పడినట్లే..! చెంతనే రెండు జీవనదులు ఉన్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదన్న బాధ ఇక ఉండదు..! జిల్లాలో సాగు, తాగునీటికి ఢోకా ఉండదని సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్ర కటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గద్వాల డివిజన్‌లోని 319 గ్రామాలకు మూడున్నరేళ్లలో రూ.600 కోట్ల వ్యయం తో  పనులను చేపట్టే విధంగా వాటర్‌గ్రిడ్ ప్ర తిపాదనలను ప్రభుత్వానికి పంపారు.

 ప్రభుత్వం పథకానికి నిధులు సమకూరిస్తే మరో మూడేళ్లలో తాగునీటి సమస్య లేకుండా ప్రతి పల్లెకూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు డిజైన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగానే జూరాల భారీ తాగునీటి పథకం స్థానంలోనే గ్రిడ్ ప్రధాన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. ఇప్పటివరకు ఈ పథకంలో పైపులైన్లలో పగుళ్లకు కారణమైన కాంట్రాక్టర్, పైబర్ పైపు ల ఏర్పాటుపై సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఫైబర్‌పైపుల స్థానంలో డీఐ పైపులు వేసి ప్రతిపల్లెకు తాగునీటిని అందించాలని
 సంకల్పించారు.

 ఆ నాలుగు గ్రామాలకు లేనట్లే..!
 గద్వాల మండలంలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామం, అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నది అవతలివైపున ఉన్న ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామాలకు మంచినీటి గ్రిడ్ ద్వారా నీటిని పంపింగ్‌చేసే అవకాశం లేదు. ఈ నాలుగు గ్రామాలకు ప్రత్యేకంగా తాగునీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు. నడిగడ్డ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి తెలిపారు.

 గ్రిడ్ రూపక ల్పన ఇలా..
 జూరాల తాగునీటి పథకాన్ని తాగునీటి గ్రిడ్‌లో అనుసంధానం చేస్తారు. జూరాల రిజర్వాయర్ నుంచి జూరాల తాగునీటి పథకం ఫిల్టర్‌బెడ్స్‌వరకు నీటినిపంపింగ్ చేస్తా రు. అక్కడ శుద్ధిచేసిన నీటిని 4.5 కి.మీ దూరంలో ఉన్న కొండగట్టుపై నిర్మించిన రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తారు.
     
కొండగట్టు పైనుంచి నందిన్నె మీదుగా ఒకలైన్, బూరెడ్డిపల్లి మీదుగా మరో ప్రధానలైను, చింతరేవుల మీదుగా మూడో ప్రధానలైన్లలో డీఐ పైపులను 300 కి.మీ మేర వేస్తారు.
     
గట్టు మండలంలో ఈ పథకం ద్వారా తాగునీరు అంద ని గ్రామాలకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి గజ్జెలమ్మగుట్టపై రిజర్వాయర్‌ను ఏర్పాటుచేసి అక్కడికి నీటిని పంపింగ్‌చేస్తారు. అక్కడి నుండి గ్రావిటీఫ్లో ద్వారా గట్టు మండలంలోని పడమటి గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే విధంగా డిజైన్‌ను రూపకల్పన చేశారు.

గద్వాల నియోజకవర్గంలో 171 గ్రామాలు, అలంపూర్ నియోజకవర్గంలో 148 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు హెచ్‌డీ పైపులతో గ్రామాలకు మంచినీటి లింకులను ఏర్పాటుచేస్తారు. ఈ పైపులను రెండు నియోజకవర్గాల్లో 800కి.మీ పొడవునా నిర్మిస్తారు. ఇలా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు సమగ్ర నమూనాను రూపొందించారు.

మరిన్ని వార్తలు