‘పానీ’ పాట్లు

19 Jun, 2019 12:32 IST|Sakshi
రోడ్డుకు అడ్డంగా ఖాళీ డ్రమ్ములను ఉంచి నిరసన తెలుపుతున్న కాలనీవాసులు

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట మున్సిపల్‌ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. మిషన్‌ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో సమస్య మరింతగా జఠిలమైంది. దీంతో స్థానికులు వీధుల్లోకి వస్తున్న ట్యాంకర్లను నిలిపివేస్తూ.. తరచూ మన్సిపల్‌ కార్యాలయానికి తరలివస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. రామాయంపేట గత ఏడాది మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పట్టణ జనాభా 17,850 వరకు ఉంటుంది. మున్సిపల్‌ పరిధిలో రామాయంపేటతోపాటు గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలను చేర్చారు. దీని పరిధిలో 60 బోర్లు, మోటార్లద్వారా నిత్యం నీటి సరఫరా జరుగుతోంది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నిర్మాణం  పూర్తవడంతో అన్ని ఇళ్లకు తాగునీరు సరఫరా జరిగేది.

దీంతో వేసవిలో పెద్దగా నీటి ఎద్దడి తలెత్తలేదు. నాలుగురోజులుగా  భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా పట్టణంలో సమస్య నెలకొంది. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అవి అవసరాలకు సరిపోవడంలేదు. ఇంటికి రెండుమూడు బిందెలకన్నా ఎక్కువ రావడం లేదనే కోపంతో వార్డుల్లో ట్యాంకర్లను అడ్డుకుంటున్నారు. మంగళవారం ఏకంగా పట్టణంలోని నాలుగుచోట్ల స్థానికులు ఆందోళనలకు దిగారు. దుర్గమ్మ గల్లీ, సుభాష్‌నగర్‌లో రోడ్డుకడ్డంగా ఖాళీ డ్రమ్ములను ఉంచి ఆందోళనకు దిగగా, ముదిరాజ్‌గల్లీలో నీటి ట్యాంకర్‌ను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.బీసీ కాలనీవాసులు మున్సిపల్‌ కార్యాలయాలనికి తరలివచ్చి ధర్నాకు దిగారు.

ట్యాంకర్ల ద్వారా సరఫరా అస్తవ్యస్తం..
పట్టణంలో ప్రతిరోజు పది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చోటామోటా నాయకులు, గుర్తింపు ఉన్నవారికి ముందుగా డ్రమ్ముల్లో నీరు నింపుతున్నారని, చివరన ఉన్నవారికి నీరు దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ గల్లీలకు ఉదయం, సాయంత్రం సరఫరా జరిగితే పరిస్థితి కొంతమేర సద్దుమణిగేదని, అలా జరగడంలేదన్న ఆరోపణలున్నాయి.

60 మోటార్లకు ఆరుకూడా నీళ్లు పోయడం లేదు..
పట్టణంలో 60 బోర్లకు సంబంధించి మోటార్ల ద్వారా నీటి సరఫరా జరుగగా, ఇటీవల కాలంలో చాలావరకు బోర్లు ఎండిపోయాయి. ప్రస్తుతం ఆరు బోర్లు కూడా పనిచేయడం లేదు. సింగిల్‌ఫేజు మోటార్ల ద్వారా నాలుగైదు చోట్ల నీటి సరఫరా జరుగుతుండగా, అవి ఎంతమాత్రం సరిపోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 చేతి పంపుల్లో నీరులేక వట్టిపోయాయి. బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న బోరులో కొద్దిగా నీరు వస్తుండగా, చాలామంది దూర ప్రాంతం నుంచి వచ్చి బారులు తీరి తీసుకెళ్తున్నారు.

సమస్యను పరిష్కరించాలి
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సరిగా చేయడం లేదు. వారికి తెలిసినోళ్లకు ఎక్కువ నీళ్లు పోస్తున్నారు. మాకు సరిగా పోస్తలేరు. ట్యాంకర్ల వెంట సార్లు ఉంటేనే కరెక్టుగా సరఫరా జరుగుతోంది. వెంటనే సమస్యను పరిష్కరించాలి.– దేవుని మల్లవ్వ, దుర్గమ్మ బస్తీ

ప్రత్యామ్నాయ   ఏర్పాట్లు చేస్తాం 
ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, బోర్లలో నీరు అడుగంటడంతో సమస్య తలెత్తింది. భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం మరింత  సమస్యగా తయారైంది. పట్టణంలో నీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన తీర్చడానికి కృషి చేస్తున్నాం. అవసరమైతే ట్యాంకర్ల సంఖ్యను పెంచడంతోపాటు ఇతర మార్గాలను అన్వేషిస్తాం.  – రమేశ్, మున్సిపల్‌ కమిషనర్‌

ఖాళీ డ్రమ్ములతో నిరసన 
రామాయంపేట(మెదక్‌): రామాయంపేట మున్సిపల్‌ పరిధిలో నీటి ఎద్దడిపై మంగళవారం స్థానికులు ఖాళీ డ్రమ్ములను రోడ్డుపై ఉంచి ఆందోళన నిర్వహించారు. అధికారులు సరిగా పట్టించుకోవడంలేదంటూ శ్రీరామా మెడికల్‌ దుకాణం వద్ద,  సుభాష్‌నగర్‌లో కాలనీవాసులు నిరసన తెలిపారు. ముదిరాజ్‌గల్లీలో నీటి ట్యాంకర్‌ను అడ్డగించారు. బీసీ కాలనీవాసులు మున్సిపల్‌ మేనేజర్‌ శ్రీహరిరాజుకు తమ సమస్య మొరపెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు