పోచమ్మా.. తీర్చునమ్మా

29 May, 2020 08:39 IST|Sakshi

కొండపోచమ్మ సాగర్‌తో తీరనున్న దాహార్తి

గ్రేటర్‌లో పానీ పరేషాన్‌కు ఇక చరమగీతం

రా వాటర్‌ తరలింపునకు మార్గం సుగమం

బొమ్మరాస్‌పేట్‌ వరకు రెండు వరుసల పైపులైన్లు   

అక్కడ నీటి శుద్ధి తర్వాత సిటికీ సరఫరా చేసే వీలు  

గోదావరి రింగ్‌ మెయిన్‌ పైపులైన్లతో అనుసంధానం  

ఆ దిశగా పనులు చేపట్టేందుకు జలమండలి సిద్ధం    

కేశవాపూర్‌ రిజర్వాయర్‌ ఆలస్యమైనా ఇక బేఫికర్‌

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొండపోచమ్మ సాగర్‌తో మహానగర దాహార్తిని తీర్చేందుకుకొండంత అండ లభించనుంది. గ్రేటర్‌ దాహార్తిని మరోవందేళ్లపాటు తీర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. కొండపోచమ్మ సాగర్‌ నుంచి రెండు వరుసల భారీ పైపులైన్ల ద్వారా రా వాటర్‌ను బొమ్మరాస్‌పేట్‌ నీటిశుద్ధి కేంద్రానికి తరలించే అవకాశం ఉంది. అక్కడ శుద్ధి చేసిన నీటిని ప్రత్యేకంగా పైపులైన్లు ఏర్పాటు చేసి ఇప్పటికే అందుబాటులో ఉన్న గోదావరి రింగ్‌మెయిన్‌ పైపులైన్లకు అనుసంధానించే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జలమండలి ఆ దిశగా పనులు చేపట్టే అంశంపై దృష్టి సారించింది. బొమ్మరాస్‌పేట్‌లో నిత్యం 172 మిలియన్‌ గ్యాలన్ల రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు భారీ నీటిశుద్ధి కేంద్రం నిర్మాణానికి 185 ఎకరాల దేవాదాయ భూమి సేకరణ పూర్తయ్యింది. దీంతో కేశవాపూర్‌ భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణంలో ఆలస్యం జరిగినా నిత్యం నగరానికి అదనంగా గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ నలుమూలలకు జలమండలి నిత్యం 480 మిలియన్‌ గ్యాలన్ల కృష్ణా, గోదావరి నీటిని తరలించి 10.60 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్న విషయం విదితమే. కేశవాపూర్‌ జలాల తరలింపుతో గ్రేటర్‌లో పానీ పరేషాన్‌కు చరమగీతం పాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

గోదావరి గలగలలు..
శామీర్‌పేట్‌ సమీపంలోని కేశవాపూర్‌ భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి భూసేకరణ చిక్కులున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర మట్టానికి సుమారు 618 అడుగుల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి 18 కి.మీ దూరంలో ఉన్న బొమ్మరాస్‌పేట్‌ నీటి శుద్ధి కేంద్రానికి (601 అడుగులకు) 3600 ఎంఎం డయా వ్యాసార్థమున్న భారీ మైల్డ్‌స్టీల్‌ పైపులైన్‌లను ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు వరుసల్లో  ఏర్పాటు చేయనున్నారు. పైసా ఖర్చు లేకుండా భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ఆధారంగా ఇక్కడికి నీటిని తరలించవచ్చు. ఇక బొమ్మరాస్‌పేట నీటిశుద్ధి కేంద్రంలో 172 మిలియన్‌ గ్యాలన్ల (10 టీఎంసీలు) రా వాటర్‌ను శుద్ధి చేసి శామీర్‌పేట్‌.. సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌కు స్వచ్ఛమైన గోదావరి జలాలను పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో ప్రస్తుతం కోటి ఉన్న  గ్రేటర్‌ సిటీ జనాభా 2030 నాటికి రెండు కోట్లకు చేరుకున్నప్పటికీ తాగునీటికి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.  

కేశవాపూర్‌ భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ ప్రత్యేకతలివే..  
రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమయ్యే భూమి: సుమారు 1200 ఎకరాలు
మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం:రూ.2346 కోట్లు.
రిజర్వాయర్‌ సామర్థ్యం: 5 టీఎంసీలు (గోదావరి జలాలు)
ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌: 596 మీటర్లు
ఎల్‌డబ్లు్యఎల్‌ (లోడ్‌ వాటర్‌లైన్‌ లెన్త్‌): 540 మీటర్లు
నీటి వనరు: కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌
రా వాటర్‌ తరలించడం: కొండపోచమ్మ సాగర్‌ నుంచి 18 కి.మీ మార్గంలో భూమ్యాకర్షణ శక్తి ద్వారా భారీ పైపులైన్ల ద్వారా కేశవాపూర్‌ రిజర్వాయర్‌ లేదా బొమ్మరాస్‌పేట్‌ నీటి శుద్ధి కేంద్రానికి తరలింపు
మొత్తం పైపులైన్లు: 2 వరుసలు
పైపులైన్‌ సామర్థ్యం: 3600 ఎంఎం డయా వ్యాసార్థం
నీటిశుద్ధి కేంద్రం: బొమ్మరాస్‌పేట వద్ద 172 మిలియన్‌ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసేందుకు వీలుగా నిర్మాణం
రావాటర్‌ తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 16 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు
శుద్ధి చేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 2 మెగా వాట్ల సామర్థ్యం గల 8 పంపులు
సీడబ్ల్యూఆర్‌ (క్రాప్‌ వాటర్‌ రిక్వైర్‌మెంట్‌): 80 మిలియన్‌ లీటర్లు

మరిన్ని వార్తలు