గ్రామాల్లో పొంచి ఉన్న తాగునీటి ముప్పు 

21 Feb, 2019 12:20 IST|Sakshi

వేసవి ప్రారంభంలోనే పల్లెల్లో  తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఒక వైపు సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిగా అడుగంటింది. దీంతో  మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి వచ్చే తాగునీటి సరఫరా నిలిచిపోయింది.  మరోవైపు  భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి.  ఈ నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. దీనికోసం అధికారులు గ్రామాల్లో  ప్రత్యేక సర్వేలు నిర్వహించి  నీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను గుర్తించారు.  దీని ప్రకారం 17 మండలాల్లోని 801 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉండనున్నాయి.  ఈ నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. 

సాక్షి, మెదక్‌ : గ్రామాల్లోని తాగునీటి వనరులు ఎండిపోవటం, తాగునీటి బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోవటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తే గ్రామాలను గుర్తించారు.  మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట మండలాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. దీంతో వేసవిలో ఈ మూడు మండలాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సింగూరు ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన నేపథ్యంలో మిగితా 17 మండలాల్లో మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఈ 17 మండలాల్లో 900కు పైగా ఆవాసాలు ఉన్నాయి.   ఇందులో 801 గ్రామాల్లో తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి.  కౌడిపల్లి మండలంలో అత్యధికంగా తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 96 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ సర్వేలో తేలింది. ఆ తర్వాత నర్సాపూర్‌ మండంలో 90, శివ్వంపేట మండలంలో 76, టేక్మాల్‌ 59, హవేళిఘణాపూర్‌ 57, వెల్దుర్తి 52, పాపన్నపేట 50, చిన్నశంకరంపేట 48, కొల్చారం 43 మెదక్‌ 36, పెద్దశంకరంపేట 38, అల్లాదుర్గం 26 గ్రామాల్లో నీటి కొరత ఏర్పడనుంది. అలాగే రేగోడ్‌ మండలంలోని 25 గ్రామాలు, నార్సింగి 6, రామాయంపేట 38, నిజాంపేట 23, చిల్పిచెడ్‌ 38 గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి.  తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ముందస్తుగానే రూ.11.93 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది.  
281 గ్రామాలకు తాగునీటి రవాణా
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనున్న 281 గ్రామాలకు తాగునీటి ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తనున్న 801 గ్రామాలకు  తాగునీటి రవాణా, బోరుబావుల మరమ్మతు, వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, బోరుబావుల ప్లషింగ్, డీపెనింగ్‌ పనులు చేపట్టేందు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి మార్చి నెలలో నిధులు విడుదల చేయనుంది. ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా 17 మండలాల్లోని 281 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందజేయనున్నారు. అలాగే 1031 బోరుబావులను అద్దెకు తీసుకోనున్నారు. 353 చేతిపంపులను ఫ్లషింగ్, 296 చేతిపంపులను డీపెనింగ్, 362 బోరుబావులను మరమ్మతు
చేయనున్నారు. 

నిధుల రాగానే పనులు ప్రారంభం..

సింగూరు ప్రాజెక్టు ఎండిపోవటం, భూగర్భజలాలు పడిపోవటం వల్ల వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.11.93 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. సీఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రభుత్వం ఈ  నిధులు త్వరలో విడుదల చేస్తుంది. వేసవిలో ప్రజలు తాగునీరు కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.  –కమలాకర్, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్‌

మరిన్ని వార్తలు