మంచినీటికి కటకట

30 Apr, 2018 12:03 IST|Sakshi
బోరు వద్ద నీళ్ల కోసం క్యూలో నిలబడిన గిరిజనులు

బొమ్మలరామారం : మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని కింది తండాలో మంచి నీటి ఎద్దడి తలెత్తింది.తండాకు మిషన్‌ భగిరథ నీరు అందుతున్నా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తండాలో కొందరి గిరిజనుల పరిస్థితి. వివరాల్లోకి వెళితే కింది తండాకు మిషన్‌ భగిరథ ద్వారా నీటిని అందించేందుకు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను నూతనంగా నిర్మించి నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఓ పది ఇళ్లకు మాత్రం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బోరు బావే దిక్కైంది.

తండాలోని చివరగా ఉన్న ఓ పది కుటుంబాలు ఇప్పటికీ భగీరథ నీటిని చూడలేదు.పైప్‌లైన్‌ ఏర్పాటులో సాంకేతిక లోపం కారణంతోనే లేక మరో కారణంగానే ఈ పది కటుంబాలకు గత మూన్నెళ్లుగా నీటి కటకట మొదలైంది. ఈ పది కుటుంబాలను మొన్నటి వరకు ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ బోరు బావి సైతం వట్టిపోవడంతో వీరికి నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అరగంటకు ఒకసారి పనులు మానుకొని బోరు బావి వద్ద నీటి కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎన్నిసార్లు నాయకులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాథుధుడే కరువైయ్యాడని తండా గిరిజనులు వాపోతున్నారు. ఇకనైనా తమకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

నీళ్లకు తిప్పలవుతోంది
తండాలో బోరు బావి వద్ద అరగంటకు ఒక బిందె నీళ్లు వస్తున్నాయి. నీళ్ల కోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నం. సర్కారోళ్లు వేసిన నల్లాల్లో నీళ్లు రాక సిలుము పడుతున్నాయి. తండా కొందరికే నీళ్లు వస్తున్నాయి. అందరికీ వచ్చేటట్లు చేయాలే. నీళ్లు సరిపోను లేక రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాం. వంతుల వారీగా నీళ్లకు లైన్‌ల నిలబడి పంచాయతీలు అవుతున్నాయి. ఎండాకాలంలో నీళ్లకు తిప్పల ఎక్కువైంది.

మరిన్ని వార్తలు