పూర్తికాని తాగునీటి పథకాలు

7 Mar, 2017 18:55 IST|Sakshi
పూర్తికాని తాగునీటి పథకాలు

► పూర్తికాని తాగునీటి పథకాలు
► గిరిజన తండాల్లో నీటిఎద్దడి  
► పట్టించుకోని అధికారులు
► అవస్థలు పడుతున్న ప్రజలు

 

ఏటూరునాగారం : ప్రజల దాహర్తిని తీర్చేందుకు తాగునీటి పథకాల కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. తాగునీటి పథకాల పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 13వ ఆర్థిక సంఘం కోయగూడ ఎల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్, లంబాడీ తండాల్లో రూ. 40 లక్షలు వెచ్చించి రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించారు. లంబాడీతండాలో నిర్మించిన ట్యాంక్‌ నిర్మాణం పూర్తయినప్పటకీ దాని నుంచి నీరు నల్లాలకు సరఫరా కావడం లేదు.

రాంనగర్‌లో చేపట్టిన ట్యాంకు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తాగునీటి పథకాల ద్వారా ప్రజలందరికీ తాగునీరు అందిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నా వాటి అమలు సవ్యంగా లేదు. ట్యాంకుల నిర్మాణం పూర్తయినా నల్లాల నుంచి తాగునీరు సరఫరా కాకపోవడంపై కాంట్రాక్టర్లు, అధికారుల పర్యవేక్షణ కరువైంది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను పర్యవేక్షించకుండానే అధికారులు బిల్లులు మంజూరు చేశారు. సర్పంచ్‌ నివాసం ఉండే గ్రామమైన లంబాడీతండాలో సైతం సమస్యలు పేరుకుపోయి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.

శాశ్వత రోడ్లు లేకపోవడం, నిరుపయోగంగా మారిన తాగునీటి నల్లాలు, పనిచేయని చేతి పంపులతో మురుగు కాల్వల నిర్వహణ లేకపోవడం లాంటి సమస్యలతో లంబాడీతండా వాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధిపై నాయకులు హామీలు హామీలుగానే నిలిచిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని లంబాడీతండా, రాంనగర్‌ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

తాగునీటికి తిప్పలు పడుతున్నాం
నల్లాల నుంచి నీరు రాకపోవడంతో చేతి పంపుల వద్దకు గంటల తరబడి వేచి చూస్తున్నాం. ట్యాంకులు నిర్మించినా అవి ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నాయకులను అడిగితే పట్టించుకోవడం లేదు.  త్వరగా సమస్యలు పరిష్కరించి నీటి సరఫరా చేపట్టాలి – కోడికట్ల నాగమ్మ, రాంనగర్‌
అధ్వానంగా మారిన రోడ్లు

చెత్తాచెదారంతో రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. రోడ్లు పెంటకుప్పలుగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి. డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో వర్షాకాలం రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వీది దీపాలు వెలుగకపోవడంతో ఇబ్బంది అవుతోంది. దోమల మందు పిచికారి చేయడం లేదు – పోరిక శ్రీనివాస్

మరిన్ని వార్తలు