వాహన లైసెన్సులు రద్దు..

10 Jan, 2020 08:10 IST|Sakshi

ఓవర్‌ స్పీడ్, డ్రంకన్‌ డ్రైవ్, సిగ్నల్‌ జంప్‌ ఏదైనా సరే..

ట్రాఫిక్‌ నిబంధనలపై ఆర్టీఏ అధికారుల  ప్రత్యేక దృష్టి

ఏడాది కాలంలో1,242 వాహన లైసెన్సులు రద్దు

బండిపై వెళుతూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపినా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌పై వేటు పడుతుంది. సాధారణంగా చాలామంది వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులు తమను గమనించడం లేదనే ఉద్దేశంతో సిగ్నల్‌ జంపింగ్, ఓవర్‌స్పీడ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ నిఘా కెమెరాలకుచిక్కుతున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసుల హ్యాండీ కెమెరాలు సైతం క్లిక్‌మనిపిస్తున్నాయి. ఇలా పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఏడాది కాలంలో 1,242 డ్రైవింగ్‌ లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్‌ చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధిలో 531, అత్తాపూర్‌ ఆర్టీఏ పరిధిలో 699 ఉన్నాయి. షాద్‌నగర్‌ పరిధిలో మరో 12 ఉన్నాయి. వీటిలో డ్రంకన్‌ డ్రైవ్‌ కింద పట్టుబడిన వారు సైతం ఉన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు  ప్రభుత్వం పాయింట్ల పద్ధతిని అమల్లోకి తెచ్చిన సంగతి  తెలిసిందే. 24 నెలల వ్యవధిలో 12 ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వివిధ ఉల్లంఘనలపై 3 నెలల నుంచి  6 నెలల వరకు సస్పెన్షన్‌ విధించారు. ఇలా మేడ్చల్‌ ఆర్టీఏ పరిధిలో ఒక లైసెన్స్‌ రద్దు కాగా, ఏడాది కాలంలో 1,120 మంది వాహనదారుల లైసెన్సులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక డ్రంకెన్‌ డ్రైవ్‌ కింద పట్టుబడి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొన్న మరో 122 మంది లైసెన్సులను సైతం 6 నెలల వరకు రవాణా అధికారులు సస్సెండ్‌ చేశారు. 

ఓవర్‌లోడ్‌ కేసులే ఎక్కువ..  
రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లిన కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ బస్సులు, సరుకు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్సులు ఎక్కువగా సస్సెండ్‌ అయ్యాయి. 338 మంది అలా తమ డ్రైవింగ్‌ లైసెన్సుల అర్హతను తాత్కాలికంగా కోల్పోయారు. ఇక సరుకు రవాణాకు వినియోగించే వాహనాల్లో ప్రయాణికులను తరలించిన మరో 17 మంది డ్రైవర్ల డ్రైవింగ్‌ లైసెన్సులను సైతంఆర్టీఏ 3 నెలల పాటు సస్పెండ్‌ చేసింది. 

సెల్‌ఫోన్‌లో మాట్లాడినా..  
బండి నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడారో ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే కాదు. డ్రైవింగ్‌ లైసెన్సును సైతం కోల్పోవాల్సిఉంటుంది. అలా ఏడాదిలో 126 లైసెన్సులపై ఆర్టీఏ వేటు వేసింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపితే 3 పాయింట్‌లు నమోదవుతాయి. రెండేళ్లలో 12 పాయింట్ల వరకు నమోదైతేలైసెన్సుపై వేటు పడుతుంది. ఇలా 126 లైసెన్సులపై సస్పెన్షన్‌ విధించారు. ఓవర్‌స్పీడ్, రాష్‌ డ్రైవింగ్‌ వంటి కారణాలతో 9 లైసెన్సులను, సిగ్నల్‌ జంపింగ్‌పై 23 లైసెన్సులను ఆర్టీఏ తాత్కాలికంగా రద్దు చేసింది.

నటుడు రాజశేఖర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌కు నో..
ఇటీవల రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సినీనటుడు రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేయబోమని రవాణా అధికారులు స్పష్టం చేశారు. ఆయన వాహనం నడిపే సమయానికే డ్రైవింగ్‌ లైసెన్సు గడువు ముగిసిందని, దానిని రెన్యువల్‌ చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపారని జాయింట్‌  ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ రమేష్‌ తెలిపారు. వివిధ రకాల ఉల్లంఘనల కింద 3 నెలల నుంచి 6 నెలల వరకు సస్పెండైన లైసెన్సులు ఆ తర్వాత చెల్లుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు