ఆర్టీఏలో డ్రైవింగ్‌ సిమ్యులేటర్లు

23 Jun, 2018 01:40 IST|Sakshi

ఖైరతాబాద్‌తో పాటు పలు చోట్ల ఏర్పాటు 

డ్రైవింగ్‌ స్కూళ్లలోనూ సిమ్యులేటర్లు తప్పనిసరి  

రవాణాశాఖ యోచన

సాక్షి, హైదరాబాద్‌: డ్రైవింగ్‌ శిక్షణలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రవాణాశాఖ ఆర్టీఏ కార్యాలయాల్లో సిమ్యులేటర్‌(అనుకరణ యంత్రం)లను ఏర్పాటు చేయనుంది. డ్రైవింగ్‌లో కనీస అవగాహన లేని వారికి నేరుగా వాహనం ఎక్కించి రోడ్లపై శిక్షణ ఇవ్వడం సరికాదని రవాణాశాఖ భావిస్తోంది. డ్రైవింగ్‌ నేర్చుకునేవాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు, పాత డ్రైవర్ల అనుభవాన్ని, మెళకువలను అంచనా వేసేందుకు వీటిని ఏర్పాటు చేయనుంది. లెర్నింగ్, డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ వంటి వాటి కోసం ఆర్టీఏకు వచ్చే వినియోగదారులు వీటి ద్వారా శిక్షణ పొందవచ్చు.  

నగరంలో ఒకటి రెండు మాత్రమే:  సిమ్యులేటర్‌ ద్వారా శిక్షణ ఇచ్చే డ్రైవింగ్‌ స్కూళ్లు నగరంలో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. మిగతా డ్రైవింగ్‌ స్కూళ్లన్నీ రోడ్లపైనే శిక్షణ ఇస్తున్నాయి. ఈ విధమైన శిక్షణతో సరైన నైపుణ్యం, అవగాహన లేకుండానే డ్రైవర్లుగా మారిపోతుండటంతో రహదారి భద్రత అతి పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ఆర్టీఏ కార్యాలయాలతో పాటుగా డ్రైవింగ్‌ స్కూళ్లలోనూ సిమ్యులేటర్లపై శిక్షణ తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

ఖైరతాబాద్‌ ఆర్టీఏతోనే ప్రారంభం 
మొదట ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేసి పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వీటి ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ పరిశీలించారు. ఆ తరువాత వీటిని మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు.  

సిమ్యులేటర్లతో దళారుల ఆటకట్టు:  చాలా దేశాల్లో సిమ్యులేటర్ల ద్వారా డ్రైవింగ్‌ శిక్షణ తప్పనిసరి. ఆ శిక్షణలో నైపుణ్యం వచ్చాకే రోడ్డు మీద వాహనం నడిపేందుకు అనుమతిస్తారు. కానీ నగరంలోని కొన్ని డ్రైవింగ్‌ స్కూళ్లు వినియోగదారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవింగ్‌ లైసెన్సులు ఇప్పించేందుకు ఆర్టీఏ అధికారులకు, వినియోగదారులకు మధ్య దళారీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో దళారీల ఆట కట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ ప్రయోజనాలు 
- డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం లేక పోయినా సిమ్యులేటర్ల ద్వారా నేరుగా శిక్షణ పొందవచ్చు. 
రహదారి భద్రతా, ట్రాఫిక్‌ నియమాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.  
క్లిష్టమైన పరిస్థితుల్లో అనుసరించవలసిన మెళకువలు తెలుసుకోవచ్చు. 
నేర్చుకునే వాళ్ల ప్రవర్తనను విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది.  
సీనియర్‌ సిటిజన్లకు డ్రైవింగ్‌ లైసెన్సుల పునరుద్ధరణలో సిమ్యులేటర్‌ పరీక్ష ఉపయుక్తంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు