తరుముతున్న కరువు

7 Sep, 2015 04:48 IST|Sakshi

మెట్‌పల్లి : రెండేళ్లుగా ఆశించిన వర్షాలు లేక జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. మంథని డివిజన్‌లో అడపాదడపా తప్ప మిగతా అన్నిచోట్ల లోటు వర్షపాతమే. భూగర్భజలాలు అడుగంటా యి.బావులు ఎండిపోయాయి. బోర్లు ఎ క్కడికక్కడే వట్టిపోతున్నాయి. అయినా ఆశచావని అన్నదాతలు కొత్తగా బోర్లు వేస్తూ అప్పులపాలవుతున్నారు. ఒక్కోరైతు 5 నుంచి 10 బోర్లు వేయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాకు వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడం రైతులకు ఆశనిపాతమైంది. రెండేళ్లుగా కాలువల నీరు రాక భూములన్నీ బీళ్లుగా మారాయి. వర్షాలు లేక చెరువుల్లో చుక్కనీరు చేరక మైదానాలను తలపిస్తున్నాయి.

వర్షాలు పడతాయనే ఆశతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదమేర్పడింది. కరువుతో అప్పులపాలైన రైతన్నలు వలసలబాట పడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై అప్పుల భారంతోపాటు కుటుంబపోషణకు ముంబై, సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఎకరాల కొద్ది భూమి, పంటలు పడినప్పుడు ఓ వెలుగు వెలిగిన అన్నదాతలు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు గల్ఫ్‌లో కూలీల అవతారమెత్తుతున్నారు. భవన నిర్మాణరంగంతోపాటు బల్దియా, హోటళ్లు, ఆఫీసులు, ఇళ్లలో క్లీనింగ్ పనులకు వేల సంఖ్యలో ఖాళీలున్నాయని, వీటికే ఎక్కువగా వెళ్తున్నారని ఏజెంట్లు చెబుతున్నారు.

ఈ పనులకు అక్కడ మన కరెన్సీలో నెలకు కంపెనీని బట్టి రూ.8 వేల నుంచి రూ.11 వేల వేతనం మాత్రమే దక్కుతోంది. వేతనం తక్కువగానే ఉన్నా... ఇక్కడ ఆ మాత్రం కూడా ఉపాధి లేకపోవడంతో వలసబాట పట్టక తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పనులకు అక్కడి కంపెనీలు ఉచితంగానే, మరికొన్ని నామమాత్రపు రుసుంతో వీసాలు మంజూరు చేస్తున్నా... ఇక్కడి ఏజెం ట్లు రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నారు.

సౌదీ అరేబియా, దుబయ్, దోహఖతర్, కువైట్, మస్కట్ వెళ్లేందుకు వీసాల కోసం చాలామంది ట్రావెల్ ఏజెంట్ల వద్ద పాస్‌పోర్టులతో క్యూ కడుతున్నారు. నాలుగు నెలల కాలంలో జిల్లా నుంచి 10 వేల మంది వలసబాట పట్టారని అంచనా. ఇటీవల రంజాన్ నెలతో గల్ఫ్ దేశాల నుంచి వీసాల జారీలో జాప్యం ఏర్పడింది. ఇప్పటికీ ఏజెంట్లకు పాస్‌పోర్టులు ఇచ్చి వేలాది మంది వీసాల కోసం ఎదురుచూస్తున్నారు.

 కానరాని వలస నియంత్రణ చర్యలు
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గల్ఫ్ దేశాలకు వలస పోవక్కరలేదని, ఉన్న ఊరిలోనే బతుకు సాగించేలా ఉపాధి కల్పిస్తామని ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ హామీలు గుప్పించింది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారుు. తెలంగాణతో బతుకులు బాగుపడుతాయని ఆశించిన వలస జీవులకు నిరాశే మిగులుతోంది. ఖరీఫ్‌లో సగటు వర్షపాతంకంటే తక్కువగా నమోదైనా ఇప్పటివరకు కరువు మండలాల ఊసే లేకుండా పోయింది. కరువు నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నారుు.

 ఇప్పటికే 300... మరో 200 మంది రెడీ
 మెట్‌పల్లి మండలం ఊటుపల్లిలో 1200 జనాభా ఉంది. 480 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, కందులు, పసుపు పండిస్తారు. వర్షాలు లేక బావులు, బోర్లు ఎండిపోయాయి. కొందరు రైతులు 5 నుంచి 10 బోర్లు వేసినా దుబ్బ వచ్చిందే తప్ప నీటి జాడ లేదు. వ్యవసాయ పనులు లేక ఉపాధి లభించక, అప్పులభారం వెంటాడడంతో గత్యంతరం లేక గ్రామానికి చెందిన 100 మంది రైతులు గల్ఫ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. 5వేల జనాభా గల సాతారం గ్రామంలోనే ఇదే పరిస్థితి. 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు, సోయాబిన్ పండేది. ఈ గ్రామం నుంచి ఇప్పటికే 300 మంది గల్ఫ్‌లో ఉన్నారు. ఇప్పుడు కరువుతో మరో 200 మంది వలసపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు