కరువు చెప్పిన ‘చరిత్ర’

7 Feb, 2016 04:51 IST|Sakshi
కరువు చెప్పిన ‘చరిత్ర’

♦ ఉదయసముద్రంలో బయటపడ్డ ‘శంభులింగాలయం’
♦ రిజర్వాయర్‌లో నీరు అడుగంటడంతో వెలుగుచూసిన చోళుల కట్టడం

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎప్పుడో ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం.. నల్లగొండకు కూతవేటు దూరంలో ఉన్న పానగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కందూరు చోళుల కాలం నాటి కట్టడం.. నల్లగా ధగధగలాడే రాతిస్తంభాలు, గర్భగుడిలో శివలింగం.. 18 స్తంభాలతో కూడిన నిర్మాణం.. వినాయకుడు, నంది విగ్రహాలు ఇలా.. చెక్కుచెదరని శిల్ప కళాచరిత్రను ‘కరువు’ బయటకు తీసింది. కాకతీయ రాజ్య సామంతుల ఏలుబడిలో నిర్మితమైన ‘శంభులింగేశ్వరుడి’ రూపాన్ని సాక్షాత్కరింపజేసింది. ఈ ఏడాది సంభవించిన కరువుతో ఉద యసముద్రం రిజర్వాయర్ అడుగంటింది. దీంతో ఈ గుడి వెలుగులోకి వచ్చింది. గతంలో రెండు, మూడుసార్లు రిజర్వాయర్‌లో నీళ్లులేక ఈ ఆలయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉదయ సముద్రంలో 0.1 టీఎంసీల కంటే తక్కువ నీరు ఉన్నందున మళ్లీ ఈ ఆలయం బయటపడడంతో దాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 బయటపడ్డవి ఇవే..
 అద్భుత కళా సంపదతో కూడిన రాతి కట్టడమైన ఈ ఆలయం.. నాటి శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఆలయం పైకప్పుపై తామరపువ్వు ఆకారంలో చెక్కిన డిజైనే ఇందుకు నిదర్శనం. తూర్పుముఖంగా నిర్మితమైన ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టబడి ఉందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. ఆలయ ముఖ ద్వారానికి ఉన్న గజలక్ష్మి మూర్తి విగ్రహం నాటి ప్రాచీన వైభవానికి ఆనవాళ్లని అంటున్నారు. ఇక.. గర్భాలయానికి ముందు కుడివైపున బొజ్జగణేశుడు, గర్భాలయంలోని లింగానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నారు. దీంతో పాటు ఆచంద్రార్క శాసనం కూడా వెలుగుచూసింది. ఈ శాసనంపై చంద్రుడు, సూర్యుడు, శివలింగం చెక్కబడి ఉన్నాయి. సూర్య చంద్రులున్నంతవరకు తమ శాసనం ఉంటుందని చెప్పడం వారి ఉద్దేశమని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ శాసనంపై తెలుగు, సంస్కృతాలను పోలిఉన్న భాషలో అక్షరాలున్నాయి.  

 ఈ శివాలయాన్ని మళ్లీ కట్టవచ్చు
 గుడి దగ్గర కనిపించిన శిల్పరీతులు, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ ఆలయం 11, 12 శతాబ్దాలకు చె ందినదిగా భావిస్తున్నాం. ఇక్కడి చారిత్రక సంపదనంతా తక్షణమే మ్యూజియానికి తరలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రిజర్వాయర్ పక్కనే స్థలం కేటాయిస్తే అక్కడే ఆలయాన్ని నిర్మించవచ్చు. అప్పుడు పర్యాటకంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత పెరుగుతుంది.
      -పి. నాగరాజు, అసిస్టెంట్ డెరైక్టర్, పురావస్తు శాఖ

మరిన్ని వార్తలు