బొక్కుడు జాస్తి.. నాణ్యత నాస్తి

4 Feb, 2015 00:56 IST|Sakshi
బొక్కుడు జాస్తి.. నాణ్యత నాస్తి

అష్టావక్రగా రూ.5 కోట్ల రోడ్డు

ఏడుపాయల రోడ్డులో నాణ్యత కరువు
నాసిరకం ఇసుకతో నిర్మాణ...లేచిపోతున్న బీటీ
పాతకల్వర్టుల రాళ్లు మాయం
తవ్వేసిన బీటీతోనే సైడ్‌బర్మ్‌ల నిర్మాణం

 
రూ.10 లక్షలు పెట్టి ఇళ్లు కడితేనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.. నాణ్యమైన సిమెంట్, ఇసుక తెప్పించి దగ్గరుండి మరీ నిర్మాణం చేయించుకుంటాం. ఎందుకంటే నిర్మాణం నిలిచి ఉండాలని..పెట్టే ప్రతిపైసా మన కష్టార్జితం కాబట్టి. కానీ మన అధికారులు, సర్కార్ మాత్రం కోట్లకు కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి రోడ్లు నిర్మించండంటూ చేతులు దులివేసుకుంది. ఈ క్షణం కోసమే కాసుక్కూచున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిగా రోడ్డు వేసేస్తున్నారు. నాణ్యమైన ఇసుక కూడా వాడకపోవడంతో చాలా చోట్ల బీటీ లేచిపోగా, రూ.5 కోట్లతో వేసిన రోడ్డు అష్టవంకరలతో దర్శనమిస్తోంది.
 
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అయితే అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటుడంతో పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది. రూ.5.70 కోట్లతో ఏడుపాయల క్షేత్రానికి వేస్తున్న రోడ్డు అష్టావక్రగా తయారైంది. నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణానికి నాసిరకం లోకల్ ఇసుక వాడడంతో పాటు గతంలో ఉన్న బీటీని తవ్వి సైడ్ బర్మ్‌లో వేసి రోలర్ తిప్పుతున్నాడు.

అడుగు భాగం నాణ్యతగా లేకపోవడం, రోలింగ్ సరిగా జరగకపోవడంతో కొత్తగా వేసిన బీటీ గంటల్లోనే లేచిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాతకల్వర్టుల విలువైన గ్రానైట్ రాళ్లు మాయమవుతున్నాయి. అయినా అధికారుల్లో చలనం లేకుండా పోతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వెయ్యేళ్ల చరిత్ర గల ఏడుపాయల దుర్గాభవాని ఆలయం వరకు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన రెండో విడత కింద రూ.5.20 కోట్లు మంజూరయ్యాయి. నాగ్సాన్‌పల్లి కమాన్ వద్ద నుంచి ఏడుపాయల వరకు గల 6.9 కిలో మీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తూ బీటీ వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నవంబర్ 2014లో టెండర్ల అగ్రిమెంట్ జరిగింది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక నిర్వహిస్తున్న అతిపెద్ద జాతర ఏడుపాయలే కావడంతో మహాశివరాత్రి జాతర నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావించారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి.

నిబంధనల ప్రకారమైతే ఇలా వేయాలి ప్రస్తుతం ఉన్నరోడ్డుకు ఇరువైపులా మూడు అడుగుల చొప్పున బీటీ వేయాల్సి ఉంది. అయితే రోడ్డుకు ఇరుపక్కల గుట్టలు ఉండటంతో వర్షాకాలంలో వరదనీరు వచ్చి తర చూ రోడ్డు కోతకు గురవుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సైడ్‌బర్మ్‌లను బలోపేతం చేయాల్సి ఉంది. మూల మలుపుల వద్ద పటిష్టమైన రోడ్డు నిర్మాణం చేయాలి.

అయితే రోడ్డుకు ఇరుపక్కల బీటీ వేసే ప్రదేశంలో మొదట 6 ఇంచుల మందం డస్ట్ ఆపై 10 ఇంచుల మందం వెట్‌మిక్స్ పోసి రోలర్‌ను తిప్పాలన్నది నిబంధన.  ఆపై మొదటి లేయర్‌లో 50 ఎంఎం, రెండో లేయర్‌లో 25 ఎంఎం బీటీ వేయాలి. నాగ్సాన్‌పల్లి నుంచి ఏడుపాయల వరకు మొత్తం 36 కల్వర్టులు ఉండగా అందులో 30 కల్వర్టులను పునర్నిర్మాణం చేయాల్సి ఉంది.

నాణ్యతకు తిలోదకాలు

ఏడుపాయల రోడ్డు పనులు పైన పటారం..లోన లొటారం అన్న చందంగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కల్వర్టులను, రోడ్డును బలోపేతంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గల ఎస్గి నుంచి తెచ్చిన  ఇసుకను పనులకు వాడాలని ఎస్టిమెట్ డాటా లీడ్‌లో సూచించారు.

కానీ ఇక్కడ మాత్రం స్థానిక  మంజీరానదిలో దొరికే నల్లటి నాణ్యతలేని ఇసుకనే ఉపయోగిస్తున్నారు. కల్వర్టుల పైభాగంలో మాత్రం మేలు రకమైన ఇసుకను వేస్తున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపుల వేసిన డస్ట్, వెట్‌మిక్స్‌లు కూడా సరైన స్థాయిలో వేయడం లేదన్న ఆరోపణలున్నాయి. పాతరోడ్డు బీటీని తవ్వి సైడ్‌బర్మ్‌లలో వేసి రోలింగ్ చేస్తున్నారు. కల్వర్టులకున్న పాతరాళ్లను మాయం చేస్తున్నారు.

ఇవి సమీప గ్రామాల్లో నడుస్తున్న ఇతర ప్రభుత్వ పనులకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఒక్కోరాయి విలువ ఎంతలేదన్నా రూ.8 నుంచి రూ. 10 వరకు ఉంటుంది. ఇలా విలువైన వేలాది గ్రానెట్ రాళ్లను సొంతం చేసుకుంటున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలన్న ఆలోచనతో వేస్తున్న బీటీ కూడా కొన్ని చోట్ల వేసిన వెంటనే లేచిపోతోంది. రోడ్ల సైడ్‌బర్మ్‌లు బలంగా లేకపోవడం, నాసిరకం ఇసుకతో నిర్మిస్తున్న కల్వర్టుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.

అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కాగా 2013లో ఇదే ఏడుపాయల రోడ్డును 5.5 కిలో మీటర్లు బలోపేతం చేసేందుకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో కూడా ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టరే నిర్వహించాడని తెలుస్తోంది. అప్పట్లో చేసిన పనులు కూడా నాణ్యత లేకపోవడంతో మూణ్నాళ్లకే కొన్ని చోట్ల రోడ్డు శిథిలమైందన్న ఆరోపణలున్నాయి.
 
కల్వర్టు రాళ్ల తరలింపుపై చర్యలు తీసుకుంటాం

ఏడుపాయల రోడ్డులోని పాత కల్వర్టుల రాళ్లను తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఎస్గి నుంచి ఇసుక తీసుకురావాలన్న నిబంధన ఉన్నప్పటికీ స్థానికంగా నాణ్యమైన ఇసుక దొరికితే దాన్ని వాడొచ్చు. కల్వర్టుల అడుగు భాగంలో స్థానిక ఇసుక వాడినా పైభాగంలో మంచి ఇసుకనే వాడుతున్నాం. ప్రస్తుతం వేసిన బీటీపై మరో లేయర్ వస్తుంది. రోడ్డు నాణ్యతను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
-పాండురంగారెడ్డి, పీఆర్‌ఏఈ.

మరిన్ని వార్తలు