రాష్ట్రంలో కరువు ఛాయలు

13 Nov, 2014 03:09 IST|Sakshi
రాష్ట్రంలో కరువు ఛాయలు

* రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
* 64 శాతం లోటు వర్షపాతం నమోదు
* వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కమ్ముకొస్తోంది. ఈ ఏడాది వర్షపాతం అత్యంత తక్కువ గా రికార్డు అయింది. భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రబీ పంటలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలకే వెళ్లాలని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టంచేసింది. రబీ ప్రారంభమైన అక్టోబర్ నుంచి బుధవారం నాటికి ఈ కాలంలో సాధారణంగా 109.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి.
 
 కానీ 39.4 మిల్లీమీటర్లే నమోదైంది. ఏకంగా 64 శాతం లోటు కనిపిస్తోంది. వాతావరణశాఖ లెక్క ప్రకారం రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు (కరువు ఛాయలు) ఏర్పడ్డాయి. ఇప్పటివరకు వేసిన లెక్కల ప్రకారం 343 మండలాల్లో వర్షాభావం, 31 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 73 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షపాతం లోటు భారీగా ఉండటంతో భూగర్భ జలాలు పాతాళంలోకి దిగిపోయాయి. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రంలో 6.29 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభిస్తే... ఈ అక్టోబర్‌లో 9.30 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయాయి.
 
 అంటే 3.01 మీటర్ల అదనపు లోతుల్లోకి జలాలు వెళ్లిపోయాయి. మెదక్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ జిల్లాలో 10.46 మీటర్ల లోతులో జలాలు లభిస్తే... ఈ అక్టోబర్‌లో 14.90 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయాయి. ఏకంగా 4.44 మీటర్ల అదనపు లోతుల్లోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయి. తర్వాత నల్లగొండ జిల్లాలోనూ ఇదే స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ జిల్లాలో 4.90 మీటర్ల లోతులో నీరు లభిస్తే... ఈ అక్టోబర్‌లో 9.10 మీటర్ల లోతుల్లోకి దిగిపోయాయి. అంటే 4.20 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లిపోయాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రబీలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. రబీలో 13.09 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 4.05 లక్షల హెక్టార్లలో సాగు పూర్తికావాలి. కానీ 2.08 లక్షల హెక్టార్లలోనే (51%) పంటల సాగు జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు