కరోనా కష్టకాలంలో కాసుల వేట

13 Jul, 2020 01:18 IST|Sakshi

ప్రాణాధార మందులు పక్కదారి

డ్రగ్స్‌ కంట్రోల్‌ శాఖ సీరియస్‌

3 నుంచి 6 రెట్ల అధిక ధరలకు కోవిడ్‌ ఔషధాల విక్రయం

రెమ్డిసివిర్, టోసిలిజుమాబ్‌ డ్రగ్స్‌ను బ్లాక్‌ చేస్తున్న డీలర్లు

సాక్షి, హైదరాబాద్‌: ఔరా.. ఏమి ఈ ఔషధ డీలర్ల దందా! కరోనా కష్టకాలంలో కాసులవేటనా? ప్రాణాధార మందులను పక్కదారి పట్టిస్తున్నారా.. అంటే, అవుననే అంటు న్నారు డాక్టర్లు, పేషెంట్లు. కోవిడ్‌ రోగులకు రెమ్డిసివిర్‌(యాంటీ వైరల్‌ డ్రగ్‌), టోసిలిజుమాబ్‌(సివియర్‌ ఇమ్యూ న్‌ రియాక్షన్‌) ఔషధాలు ప్రాణాధారం. వీటి కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఔషధ డీలర్లకు బల్క్‌ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ వెయింటింగ్‌లో పెట్టి తక్కువ మొత్తంలోనే సరఫరా చేస్తున్నారు. ఇదేమంటే.. స్టాకు లేదని సాకులు చెబుతున్నారు. మరోవైపు ఇవే ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌ లో 3 నుంచి 6 రెట్ల అధికధరలకు విక్రయిస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి వచ్చింది. 

వాస్తవ ధరలు ఇలా... 
బహిరంగ మార్కెట్‌లో రెమ్డిసివిర్‌ డ్రగ్‌ వాస్తవ ధర రూ. 5,500 కాగా కొందరు డీలర్లు బ్లాక్‌ మార్కెట్‌లో రూ. 30–40 వేలకు విక్రయిస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోలర్‌ శాఖకు ఫిర్యాదులందాయి. మరో ప్రాణాధార ఔషధం టోసిలిజుమాబ్‌ ఔషధం వాస్తవ ధర రూ.40 వేలు కాగా దీనిని రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షలకు విక్రయిస్తుండడం గమనార్హం. నగరంలో ఇటీవల ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి 3 వేల వైల్స్‌ రెమ్డిసివిర్‌కు ఆర్డర్‌ చేయగా 400 వైల్స్‌(ఇంజెక్షన్స్‌) మాత్రమే డీలర్‌ సరఫరా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా, నగరంలో ప్రాణాధార ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు, పపేపపేషెంట్లు కోరుతున్నారు. మరోవైపు ఈ ప్రాణాధార ఔషధాలను తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 

డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ సీరియస్‌ 
నగరంలో కోవిడ్‌ కేసులు శరవేగంగా పెరుగుతుండడం.. మరోవైపు ఈ మహమ్మారి చికిత్సకు వినియోగిస్తున్న ప్రాణాధార ఔషధాలను కొందరు అక్రమార్కులు బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తుండడం పట్ల డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తీవ్రంగా పరిగణించింది. తక్షణం ఈ అంశంపై నివేదిక సమర్పించాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. బ్లాక్‌ దందాపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి అక్రమార్కులను కట్టడి చేయాలని స్పష్టం చేసింది. 

ఆరు దేశీయ కంపెనీలకు అనుమతి 
దేశీయంగా రెమ్డిసివిర్‌ జనరిక్‌ ఔషధ తయారీ బాధ్యతలను అమెరికాకు చెందిన గిలాడ్‌ సైన్సెస్‌ నుంచి ఆరు భారతీయ కంపెనీలు అనుమతి తీసుకొని ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ ఔషధాలను మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఆయా సంస్థలు విక్రయిస్తున్నాయి. అయినప్పటికీ మనదేశంలో పలు మెట్రో నగరాల్లో ఈ ఔషధం డిమాండ్‌కు సరిపడా సరఫరా కావడం లేదని అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. తక్షణం ఈ ప్రాణాధార ఔషధాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, అన్నిచోట్లా లభ్యత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు