ఫీవర్‌లో మందుల్లేవ్‌..

5 Sep, 2019 11:08 IST|Sakshi
క్రిస్టల్‌ పెన్సిలిన్‌(సీపీ), బెటాడిన్‌ గార్గిల్‌

క్రిస్టల్‌ పెన్సిలిన్‌(సీపీ), బెటాడిన్‌ గార్గిల్‌ నో స్టాక్‌

సరఫరా నిలిపివేసిన ఫార్మా కంపెనీలు

రోగుల అవస్థలు

నల్లకుంట: కొన్ని ఖరీదైన మందుల్లేక ఫీవర్‌ ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. డిప్తీరియా, బుల్‌నెక్, టెటానస్‌ రోగులకు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక చిక్సితలు అందిస్తారు. ఆయా వ్యాధులతో బాధపడుతున్న రోగి గొంతు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం  కష్టంగా మారుతుంది. అలాంటి ప్రాణపాయస్థితిలో ఉండే డిప్తిరీయా రోగులకు యాంటి డిఫ్తీరియా సీరం(ఏడీఎస్‌ )తో పాటు క్రిస్టల్‌ పెన్సిలిన్‌(సీపీ) యాంటి బయోటిక్‌ తప్పని సరిగా ఇవ్వాలి. కాగా ఏడీఎస్‌ సీరంను మహబూబ్‌నగర్‌లోని విన్స్‌ బయోఫాం నుంచి ఫీవర్‌ ఆస్పత్రికి సరఫరా చేస్తున్నారు. సీపీ మందులను ఉత్తరాదికి చెందిన ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. దీని ఖరీదు రూ. 750 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. సీపీ ఖరీదు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే ఆ మందులు సరఫరా చేయాలనే నిబంధనల నేపథ్యంలో నార్త్‌కు చెందిన ఫార్మా కంపెనీ సరఫరాను అర్థాంతరంగా నిలిపి వేసినట్లు సమాచారం. దీంతో గత నెల రోజులుగా ఆ మందులు స్టాక్‌ లేకపోవడంతో  చికిత్స కోసం వచ్చే డిఫ్తీరియా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బహిరంగ మార్కెట్‌లో కూడా  ఈ మందులు లభించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో చిన్నారులు కొందరు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన సీపీని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

బెటాడిన్‌ గార్గిల్‌ ,కార్నిటారేట్యాబ్లెట్లు నో స్టాక్‌..
అదే విధంగా డిఫ్తీరియా రోగులకు ఇవ్వాల్సిన బెటాడిన్‌ గార్గిల్‌ లిక్విడ్, కార్నిటారే(గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తుంది) ట్యాబ్లెట్లు కూడా స్టాక్‌ లేదు. కార్నిటారే ట్యాబ్లెట్లకు బదులుగా ఇంజక్షన్లు ఇస్తుండడంతో కాస్తా ఊరట లభిస్తోంది. అయినా డిఫ్తీరియా రోగులు నోరు శుభ్రం చేసుకునేందుకు వినియోగించే బెటాడిన్‌ గార్గిల్‌ స్టాక్‌ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. డిఫ్తీరియా బాధితుల్లో పలువురు నిరక్షరాస్యులు, మురికి వాడలకు చెందిన వారే ఉంటున్నారు.  దీంతో ఈ జబ్బు బారిన పడిన వారి క్రిస్టల్‌ పెన్సిలిన్‌(సీపీ), బెటాడిన్‌ గార్గిల్‌ ,కార్నిటారే ట్యాబ్లెట్లు కూడా వాడాలని తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రిస్టల్‌ పెన్సిలిన్‌(సీపీ) మందును తెప్పించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు