15 రోజులు... రూ.26 లక్షలు!

17 Nov, 2018 10:15 IST|Sakshi

మందుబాబులు చెల్లించిన జరిమానా ఇది

ఓ ‘నిషా’చరుడికి రెండు నెలల జైలు శిక్ష

289 మంది కటకటాల్లోకి, 71 డీఎల్స్‌ రద్దు

నగర అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఈ నెల మొదటి పక్షంలో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన మందుబాబులు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాల రూ.26,95,500. దీంతో పాటు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపటం తదితర ఉల్లంఘనలకు సంబంధించి 15 రోజుల్లో నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్స్‌లో మొత్తం 1244 మంది పట్టుబడ్డారు. వీరిలో 289 మంది జైలుకు వెళ్లగా, 10 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను (డీఎల్స్‌) శాశ్వతంగా, 61 మందివి నిర్ణీత కాలానికి రద్దు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల్లో చిక్కిన వారు మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు పది మంది డ్రైవింగ్‌ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... ఐదుగురివి ఐదేళ్లు, నలుగురివి నాలుగేళ్లు, 19 మందివి మూడేళ్లు, పది మందివి రెండేళ్లు, 20 మందివి ఏడాది, ముగ్గురివి ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి రెండు నెలలు, ఇద్దరికి నెల, ఒకరికి 25 రోజులు, ఆరుగురికి 20 రోజులు జైలు శిక్ష పడింది. వీరితో పాటు  మరో ఇద్దరికి  15 రోజులు, ఆరుగురికి పది రోజులు, ఒకరికి తొమ్మిది రోజులు, ఇద్దరికి ఎనిమిది రోజులు, 11 మందికి వారం, ఏడుగురికి ఆరు రోజులు, 30 మందికి ఐదు రోజులు, 36 మందికి నాలుగు రోజులు, 58 మందికి మూడు రోజులు, 117 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించినట్లు ఆయన వివరించారు. డ్రంక్‌ డ్రైవింగ్‌తో పాటు మరో రెండు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్‌షీట్లు వేస్తున్నామని, వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసిన 7 మందికి రెండు రోజులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరంపై ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ వివరించారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సిలింగ్స్‌ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని అనిల్‌కుమార్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు