ఎండుతున్న మంజీరా

26 May, 2018 10:17 IST|Sakshi
ఎండిపోయిన మంజీరా నది

నదిలో పూర్తిగా ఆగిపోయిన నీటి ప్రవాహం

నిలిచి ఉన్న కొద్దిపాటి నీరు

నీటి పథకాల వద్ద తగ్గుముఖం

ఎండలు మండితే తాగునీటికి కష్టమే..

ఖేడ్, ఆందోలు, జహీరాబాద్‌ నీటి పథకాలు నదిపైనే ఆధారం

నారాయణఖేడ్‌ (మెదక్‌): మంజీరా నది ఎండుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే నదిపై ఆధారపడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే సకాలంలో వర్షాలు కురవని పక్షంలో మంజీరా నదిపై ఆధారపడి ఉన్న గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు.

గత ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో మంజీరా నది పూర్తిగా నిండి కళకళలాడింది. నది నుంచి భారీగా నీటిని వదలడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. మంజీరా నదిపై నారాయణఖేడ్‌ నియోజకవర్గంతోపాటు జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు చెందిన తాగునీటి పథకాలు ఉన్నాయి. వర్షాలు ఏమాత్రం ముఖం చాటేసినా నీటి పథకాలు వట్టిపోనున్నాయి.

ఇప్పటికే నీటిపథకాల నిర్వహణ కష్టతరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాం జనవ్‌వాడ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మంజీరా నది నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో అత్యధిక ప్రాంతంలో పారే నది ఖేడ్‌ నియోజకవర్గంలోనే. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది.

నదిలో సమృద్ధిగా వరద నీరు వచ్చి చేరింది. కాగా ఏడాది ప్రారంభంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతోపాటు ఘన్‌పూర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు విడతల వారీగా సింగూరు నుంచి నీటిని వదిలారు. ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ 10 టీసీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల వరకు నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ అంతకంటే తక్కువ టీఎంసీల నీరు మాత్రమే ఉందని ప్రతిపక్షాలు, నది సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ తగ్గే స్థాయిలో పూడిక మట్టి ఉంది. నది నుంచి భారీగా నీరు వదలడంతో ఘన్‌పూర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు వేసవి చివరిలోనూ నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. మంజీరా నది మాత్రం ఎండిపోతోంది.

నీటి పథకాలకు గడ్డుకాలం.. 

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీరా నది నుంచే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్‌ఏపీ పథకం ఫేజ్‌ 1కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్‌ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్‌ పథకం ద్వారా 40గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్‌గిద్ద, కంగ్టి మండలాల్లోని 66గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.

ఈ నీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లు అన్నీ మంజీరా నదిపైనే ఉన్నాయి. ఇప్పటికే గూడూరు పథకం ద్వారా రోజు విడిచి రోజు, రెండు రోజులకు ఓ మారు నీటి సరఫరా జరుగుతోంది. శాపూర్, బోరంచ ఇన్‌టెక్‌ వెల్‌ వద్ద కూడా నీరు తగ్గింది. ముందు ముందు ఎండల పరిస్థితి ఇలాగే ఉంటే తాగునీటి పథకాలు వట్టిపోతాయి.

నదిలో నీరు తగ్గడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్‌ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్‌ ఇస్తున్నాయి. జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్‌ వెల్‌లు కూడా మంజీరా నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.  మంజీరా నది ప్రారంభం మొదలుకొని గోదావరిలో కలిసే వరకు పూర్తి ప్రవాహంలో రాయిపల్లి వంతెన వద్ద ఉన్నంత ఉద్ధృతి ఎక్కడా కన్పించదు. ఈ వంతెన సమీపంలో కనుచూపు మేర పూర్తిగా నీటితోనే నది కన్పిస్తుంది. 

కానీ ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిలా తయారైంది. నదిలోంచి పశువులు, జనాలు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు నడిచి వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నదిలో అక్కడక్కడా గోతుల్లో ఉన్న నీటిలో పశువులు ఈదుతున్నాయి. నది ఎండడంతో రబీ సీజన్‌కు సంబంధించి జొన్న, శనగ తదితర పంటలను నది ముంపు భూముల్లో రైతులు సాగుచేసి పంటలను సైతం తీసుకున్నారు. నది పరిస్థితి చూసి జనాలు తల్లడిల్లుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే వరుణుడు కరుణిస్తేనే మూడు నియోజకవర్గాల్లోని ప్రజలునీటి ఎద్దడి నుండి బయట పడగలరు.  

మరిన్ని వార్తలు