ఎఫ్‌ఆర్వోపై దాడి: డీఎస్పీ, సీఐపై సస్పెన్షన్‌ వేటు

30 Jun, 2019 20:20 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఫారెస్ట్‌ అటవీ అధికారిణి అనితపై జరిగిన దాడిని వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విధులను సక్రమంగా నిర్వహించని కాగజ్‌ నగర్‌​ డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంకటేశ్వర్లను సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. దాడి సంఘటనకు సంబంధించి మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నామని, అందులో 16మందిపై పలు సెక్షన్ల కింద కేసుల నమోదు చేసినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కోనేరు కృష్ణ .. ‘నెల రోజులుగా ఫారెస్ట్‌ అధికారులు ఇక్కడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైతులు ఫోన్‌ చేస్తేనే మేము అక్కడికి వెళ్లాం. మేము  ఎవరిపై దాడి చేయలేదు’ అని తెలిపారు. దాడిలో గాయపడ్డ ఎఫ్‌ఆర్వో అనిత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కోనేరు కృష్ణ... జెడ్పీ వైస్‌ చైర‍్మన్‌ పదవితో పాటు, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.
 

మరిన్ని వార్తలు