దుబాయ్‌లో శివాజీ అడ్డగింత

28 Jul, 2019 02:29 IST|Sakshi

అమెరికా విమానం ఎక్కుతుండగా ఆపేసిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు

మరో విమానంలో భారత్‌కు తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 అధికార మార్పిడి కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ అమెరికా వెళ్లకుండా మరోసారి ఆటంకం ఎదురైంది. కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో అమెరికా వెళ్తుండగా దుబాయ్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ నెల 26న (శుక్రవారం) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అమెరికా విమానం ఎక్కుతుండగా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. ఆయన్ను అడ్డుకుని మరో విమానంలో భారత్‌కు పంపించారు. అయితే ఇందుకు కారణాలేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకుని సైబరాబాద్‌ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పుడు విచారించిన పంపిన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని శివాజీకి నోటీసులు ఇచ్చారు.

ఆయనపై ఎలాంటి ఆంక్షలు లేవు
దుబాయ్‌ విమానాశ్రయంలో శివాజీని అడ్డుకోవడంపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పందించారు. శివాజీ విదేశాలకు వెళ్లే విషయంలో తామెలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన స్పష్టంచేశారు. దుబాయ్‌లో ఇమిగ్రేషన్‌ అధికారులు అతన్ని ఎందుకు తనిఖీ చేశారు? ఏ కారణంతో వెనక్కి పంపారన్న సంగతి తమకు తెలియదన్నారు. ఈ విషయం ఒక్క శివాజీకి మాత్రమే తెలుసని.. ఆయన మాట్లాడితేనే విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు. తెలంగాణలో నమోదైన కేసులు కాకుండా వీసా లేదా ఇతర వివాదాలేమైనా కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు