కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఊరట..

28 Apr, 2020 02:59 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాల్లోని స్టోన్‌ క్రషర్లు, ఇటుక బట్టీలు, చేనేత పరిశ్రమలకు మినహాయింపు

యథావిధిగా కార్యకలాపాలకు అనుమతులు మంజూరు

లక్షలాది మందికి తిరిగి ఉపాధి 

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా 36 రోజులుగా మూతబడిన కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్టోన్‌ క్రషర్లు, ఇటుక బట్టీలు, చేనేత పరిశ్రమలు, ట్రాక్టర్, వరికోత యంత్రాల రిపేర్‌ షాపులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిస్తూ తెలం గాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిలో యథావిధిగా కార్యకలాపాలు జరపొచ్చని అనుమతులు మంజూరు చేసింది. ఆయా పరిశ్రమల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటిం చాలని స్పష్టంచేసింది.

వీటిలో పనిచేసే ఉద్యోగుల రవాణా, రాకపోకలకు సంబంధించిన ఆటంకాలు లేకుండా చూడాలని తెలంగాణ డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వరితోపాటు పలు రకాల పంటలు కోతకు వచ్చాయి. వీటిని కోసేందుకు రాష్ట్రంలో దాదాపుగా 15 వేలకు పైగా వరికోత యంత్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొత్తం ఎంత ధాన్యం వచ్చినా తామే కొంటామని పదేపదే ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. ఈ పనులు నిరంతరాయంగా కొనసాగించే క్రమంలో చాలా చోట్ల యంత్రాలకు రిపేర్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం ట్రాక్టర్, వరికోత యంత్రాలు రిపేర్‌ చేసే షాపులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

కూలీలకు ఉపశమనం..
లాక్‌డౌన్‌ కారణంగా ఐదు వారాలుగా ఎలాంటి పని లేకుండా.. ఒక పూట తిని, మరోపూట పస్తుంటున్న వలస కూలీలు, కూలీలకు ప్రభుత్వ నిర్ణయం భారీ ఉపశమనాన్ని కలిగించనుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి బాధలు వర్ణనాతీతం. చేతిలో చిల్లి గవ్వలేక, ఇతరుల వద్ద చేతులు చాచలేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలామంది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు పిల్లాజెల్లాతో మండుటెండల్లో కాలినడకన బయల్దేరిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ప్రభుత్వం ఇటుక బట్టీలు, స్టోన్‌ క్రషర్లు, చేనేత పరిశ్రమలు నడిపించుకునేందుకు అనుమతించడంతో లక్షలాది మందికి తిరిగి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లాలు క్రమంగా ఆరెంజ్‌ జోన్‌కు వస్తుండటం, పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ గడువు కూడా దగ్గరికి వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: మర్కటాలకు మహాకష్టం

మరిన్ని వార్తలు