కలుషిత నీరు కలకలం

31 Jul, 2018 11:02 IST|Sakshi
గ్రామంలోని పీహెచ్‌సీలో బెడ్లు ఖాళీ లేక బెంచీలపై చికిత్స పొందుతున్న రోగులు 

తోటపల్లిలో 50 మందికి అస్వస్థత

వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి బాట పట్టిన ప్రజలు

గ్రామాన్ని సందర్శించిన డీఎంఅండ్‌హెచ్‌ఓగేట్వాల్‌ గుంతే నీటి కలుషితానికి కారణం..?

బెజ్జంకి(సిద్దిపేట) : కలుషిత నీరు తాగి మండలంలోని తోటపల్లిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి గ్రామానికి చెందిన పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వీరందరిని కరీంనగర్, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.

కొందరు గ్రామంలోని ప్రభుత్వాస్పత్రితో పాటు, బెజ్జంకిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందారు. ఇందులో 25 మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 20 మంది కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రి, ఇద్దరు ప్రతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి ఇద్దరిని తరలించగా రాజయ్య అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. 

గ్రామంలో పర్యటించిన డీఎంహెచ్‌ఓ..

వివరాలు తెలుసుకున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల ఆదేశాలతో గజ్వేల్‌ సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిద్దిపేట డీఎంఅండ్‌హెచ్‌ఓ అమర్‌సింగ్‌ నాయక్, గడా హెల్త్‌ ప్రత్యేకాధికారి కాశీనాథ్‌ హుటాహుటిన గ్రామానికి వచ్చి చికిత్స పొదుతున్న రోగులను, గ్రామానికి నీరు సరఫరా చేసే బావిని పరిశీలించారు.

జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, అధికారులు గ్రామంలో పర్యటించారు. నీటి సరఫరా నిలిపివేయించారు. ప్రతీ ఇంటికీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులను పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ జానకి, తహసీల్దార్‌ నాగజ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఈ సాయి, హుస్నాబాద్‌ వైద్యులు, రెవెన్యు సిబ్బంది, కార్యదర్శులు పర్యటించారు.

గేట్‌వాల్వ్‌ వద్దే కలుషితం..?

గ్రామంలోకి వెళ్లే రోడ్డు పక్కన మంచి నీటి పైప్‌కు ఉన్న గేట్‌  వాల్వ్‌ వద్ద కొన్ని రోజులు నీరు లీకవుతోందని స్థానికులు తెలిపారు. దానిని బాగు చేయకపోవడంతో అది ఓ మురుగు గుంతలా మారింది. అక్కడ కలుషితమైన నీరు పైపుల్లోకి వెళ్లడంతో గ్రామమంతా సరఫరా అయ్యాయన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.  సరఫరా అయిన తాగునీటి నమూనాలను అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

క్లోరినేషన్‌ లేకపోవడంతోనే..

తాగు నీరు సరఫరా అయ్యే బావిలో క్లోరినేషన్‌ చేయకపోవడం, పైప్‌లైన్ల లీకేజీ కారణంగా నీరు కలుషితం అయి ఉంటుంది. ప్రజలు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.  - అమర్‌సింగ్‌ నాయక్, డీఎంహెచ్‌ఓ

ఆదివారం నుంచి వాంతులు..

ఆదివారం వాంతులు, విరేచనాలు అయ్యాయి. మొదట బెజ్జంకిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన. మా ఊరిలోని ప్రభుత్వాస్పత్రిలో మందులు ఇస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి చేరిన. ఇప్పుడు కొంత నయంగా ఉంది.   - ఎన్నం రాజేశ్వరి, తోటపల్లి

మరిన్ని వార్తలు