మందు బాబులను ఆగమాగం చేస్తోంది...

28 Mar, 2020 12:13 IST|Sakshi

మందుబాబులకు కరోనా కష్టాలు

చుక్క లేక తిక్క...

చివరికి కల్లు సేవించేందుకు మొగ్గు... 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా ఫర్వాలేదు కానీ చుక్క పడకపోతే కాళ్లు చేతులు ఆడవు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. నరాలన్నీ ఒక్కసారిగా లాగుతూ మందు బాబును నిలబడనీయడంలేదు. ఏ బ్రాండ్‌ అయినా ఫర్వాలేదు పెగ్గు ఉన్నా చాలు అన్నట్లుంది వారి పరిస్థితి.  ఏదో ఒకటి  నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు చూస్తున్నారు. అదీ లేకుంటే కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గ్రామీణ  ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్‌చల్‌ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

ఉదయం నిద్రలేవగానే గొంతులో మందు చుక్క పడనిదే అడుగు ముందుకు వేయని మందుబాబులు...లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రోజులుగా మద్యం లభించకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలను సైతం బంద్‌ చేశారు. నగరంలోని పలుచోట్ల కొందరు మద్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. మరికొంతమంది వైన్‌ షాపుల వద్ద మద్యం కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని  ఇందిరానగర్‌లో ఉంటున్న మధు అనే పెయింటర్‌ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

లాక్‌డౌన్‌తో కిక్కు కరువై
కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) మందు బాబులను ఆగమాగం చేస్తోంది. లాక్‌డౌన్‌తో బార్లు, మద్యం దుకాణాలు కూడా మూత పడడంతో మద్యం కోసం నానాయాతనలు పడుతున్నారు. అక్కడక్కడా బెల్టు షాపులు ఆదుకున్నా.. అక్కడ కూడా నిల్వలు అడుగంటిపోవడం.. ధరలు నింగినంటడంతో లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకు ఖరీదైన బ్రాండ్లు తప్ప మద్యం ముట్టని బడాబాబులు కూడా చోటామోటా బ్రాండ్లతో సరిపుచ్చుకుంటున్నారు. కేవలం 24 గంటలపాటే జనతా కర్ఫ్యూ ఉంటుందని భావించిన మందుబాబులు.. మద్యం కొనుగోళ్లపై ముందుచూపు ప్రదర్శించలేదు. రాత్రికి రాత్రే ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో బిత్తరపోయారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!)

చేసేదేమీలేక వైన్స్‌షాపులు, బెల్టు షాపుల్లో ఉన్నవాటిని గుట్టుగా కొని గుటకేసినా.. అక్కడ కూడా మందు సీసాలు ఖాళీ కావడంతో దేశీ మద్యం వైపు చూస్తున్నారు. దేశీ మద్యం అంటే అదేంటో అనుకుంటున్నారా? అదేనండీ గుడుంబా, నాటుసారా. ఆఖరికి కల్లు. ఈ మూడే ప్రస్తుతం మందుబాబులకు ఆదుకుంటున్నాయి. అయితే, ఇవీ కూడా ఎక్కడపడితే అక్కడ దొరకడంలేదు. కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతున్నాయి. గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో ఐదేళ్ల క్రితమే వీటి తయారీని నిలిపివేసిన తయారీదారులు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో గుట్టుగా నాటుసారా బట్టీలను మొదలుపెట్టారు. (అగ్రరాజ్యం అతలాకుతలం)

తాటివనాల్లో మందు..విందు!
ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇన్నాళ్లూ హైదరాబాద్‌ సహా పట్టణాల్లో ఉన్నవారంతా లాక్‌డౌన్‌ పుణ్యామా అని పల్లెబాట పట్టారు. మద్యం లభ్యం కాకపోవడం... దొరికినా భారీ రేట్లు పలుకుతుండడంతో కల్లు సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని తాటి వనాల్లో ఎక్కడ చూసినా మందుబాబుల సందడే కనిపిస్తోంది. దీనికితోడు చికెన్‌ ధరలు కూడా పడిపోవడంతో కల్లు చుక్క..చికెన్‌ ముక్కతో ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో మొన్నటివరకు రూ.20 నుంచి 30 వరకు దొరికే కల్లు సీసా ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది.  పట్టణాలు, మండలాల్లో కల్లు దుకాణాలు బంద్‌ కావడంతో కల్లు ప్రియులు గందరగోళంలో పడ్డారు. కల్లు డిపోలు తెరవాలని ముస్తేదార్లపై ఒత్తిడి తెస్తున్నారు. కలుకు బానిసలైన కొంతమంది మాత్రం మానసికంగా బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!)
ఆస్పత్రులకు క్యూ కడుతున్న కల్లు బాధితులు

నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కల్లు దుకాణాలు మూతపడటంతో కల్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ... వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా నగరంలోని ముదిరాజ్‌గల్లిలో భూషణ్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కల్లు దొరకకపోవడంతో పిట్స్‌ వచ్చి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు.

వైన్‌ షాపులో చోరీ
ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్‌ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్‌ను పట్టుకెళ్లారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్‌లో ఆగంతకులు షాపు షట్టర్స్‌ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్‌, ఎక్సైజ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు