సందు చూసి..

28 Sep, 2014 03:28 IST|Sakshi
సందు చూసి..
 •  పండుగ పూట వైన్ షాపుల దందా
 •  బెల్ట్ షాపులకు మందు డోర్ డెలివరీ
 •  ఎక్సైజ్ అండదండలతో వ్యాపారుల ఇష్టారాజ్యం
 •  ధనదాహంతో నిబంధనలకు తిలోదకాలు
 •  గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
 • సాక్షి ప్రతినిధి, వరంగల్ : దసరాకు ముందే పల్లెలను మత్తులో ముంచెత్తి... జేబులు నింపుకునేలా మద్యం వ్యాపారులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని వైన్‌షాపుల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి.. ట్రాలీ ఆటోలతో మద్యం సీసాలను నేరుగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలన్న చందంగా కొనసాగుతోంది.

  అంతేకాదు... మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ అధికారు లు విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. ప్రభుత్వం అధికారికంగా కేటాయించి న వైన్ షాపులు, బార్లలోనే మద్యం అమ్మకాలు జరగాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నిబంధనలకు ఎక్సైజ్ శాఖ అధికారులే పాతర వేస్తున్నారు. బెల్ట్ షాపుల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన వారు... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

  మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం తెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. వైన్‌షాపుల నుంచి బెల్ట్ షాపులకు ఆటోల్లో మద్యం సరఫరా దందా వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఎక్కువగా జరుగుతోంది. వర్ధన్నపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలోని మండలాల్లో ఈ రకమైన దందా ఇంకా ఎక్కువగా ఉంది. దీనిపై పలువురు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.
   
  సిండికేట్‌గా మారి...

  వర్ధన్నపేట మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు, ఇదే మండలంలోని ఇల్లంద, పంథిని, ఐనవోలు గ్రామాల్లో ఒకటి చొప్పున వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 1 నుంచి ఈ ఆరు వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. వైన్ షాపులు తెరుస్తూనే నీళ్లు కలిపిన మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయించడం మొదలుపెట్టారు. దీనికి ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తారుు. చివరకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఒక వైన్ షాపులో తనిఖీ చేసి మూసివేశారు. సదరు నిర్వాహకుడు ఫైన్ చెల్లించి... ఆ షాపును మళ్లీ తెరిచాడు. ఆరు షాపుల్లో పోటీ వల్ల దాడులు జరిగాయని భావించి... అన్ని షాపుల యజమానులు ఒక్కటయ్యారు.

  ఆరు వైన్ షాపులకు వచ్చిన మద్యాన్ని ఒకే గోదాంలో పెట్టి... ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆరు వైన్ షాపులకు సంబంధించిన అమ్మకాల్లో వాటా ఎలా అనే దానికి కొత్త ఉపాయం రచించారు. ఆరు వైన్ షాపుల సరుకులో ఏ మద్యం సీసా ఎవరిది అనే దాన్ని గుర్తించేందుకు ఆయా వైన్ షాపుల పేరులో మొదటి అక్షరంతో స్టిక్కర్లను ముద్రించారు. వీటి ఆధారంగా అమ్మకాలకు సంబంధించిన డబ్బులు పంచుకుంటున్నారు.
   
  ఎక్సైజ్ పని మారింది...

  బెల్ట్ షాపులను నియంత్రణను పక్కనబెట్టిన ఎక్సైజ్ శాఖ కొత్త రకమైన విధులను చేపట్టింది. బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నది ఆయా ప్రాంతాలకు చెందిన వైన్ షాపుల మద్యం సీసాలేనా అని మాత్రమే చూస్తోంది. తనిఖీకి వచ్చిన అధికారులు బెల్ట్ షాపును మూసివేయకుండా... వెళ్తూ వెళ్తూ ఒకటిరెండు ఖరీదైన మద్యం సీసాలు తీసుకెళ్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమాలకు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్దతు ఇస్తుండడంతో... మద్యం వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే దసరా సీజన్‌లో ఇష్టారాజ్యంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా