వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం

19 Apr, 2016 02:16 IST|Sakshi

హెచ్‌ఎంలకు బాధ్యతల అప్పగింత
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో టిఫిన్, రెండుపూటలా భోజనం

 

విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఎస్సీ, ఎస్టీ గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆయూ పాఠశాలల హెచ్‌ఎంలకు బాధ్యతలు అప్పగిస్తూ  విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు. హైస్కూళ్లలో ఎక్కువమంది విద్యార్థులున్నచోట హెచ్‌ఎంతోపాటు మరో టీచర్ కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు విద్యార్థులు  పాఠశాలకు వచ్చి కాసేపు ఆడుకున్నాక 10 గంటలకు భోజనం పెట్టాలి. ఈ నెల 21 నుంచి ఆదివారాలతో కలిపి మొత్తం 53 రోజులపాటు ఈ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్‌తో సహా మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులో ఉంచాలి. వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు వేసవి సెలవుల్లో ఏ మండలంలో ఉంటే అక్కడి రెసిడెన్షియల్ స్కూల్‌కు కూడా వెళ్లి భోజనం చేయవచ్చు. జిల్లాలో 25 చోట్ల బాలురకు, 25చోట్ల బాలికలకు రెసిడెన్షియల్‌గా కూడా మధ్యాహ్న భోజనం అందించబోతున్నారు. ఈనెల 25 నుంచి గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో దీన్ని అమలుచేయబోతున్నారు.  కాగా, విధులు నిర్వహించే హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు  పీపీఎల్ లీవ్స్ ఇచ్చే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. భోజనం అమలుపై  ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు అందనున్నారుు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అదనపు జేసీ తిరుపతిరావు, పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ బాలయ్య, డీఈవో పి రాజీవ్, ఐటీడీఏ పీవో ఆమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
జిల్లాలో 2,46, 811 మంది..

జిల్లాలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కలిపి 2,46, 811 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సుమారు 40 శాతం మంది మధ్యాహ్న భోజనానికి వస్తారని అంచనా. కాగా, అన్ని పాఠశాలలకు 53 రోజులకు సరిపడా సుమారు 999.457 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేయబోతున్నారు. అలాగే వంట ఖర్చుల కింద రూ 3.55 కోట్లు అవసరమని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు.

 

>
మరిన్ని వార్తలు