దసరా కలిపింది ఇద్దరిని..

23 Oct, 2015 23:33 IST|Sakshi
దసరా కలిపింది ఇద్దరిని..

- ఒకే వేదికపై చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి
- ఆప్యాయంగా కరచాలనం, పలకరింపు
సాక్షి, సంగారెడ్డి:
ప్రత్యర్థులు ఒకే వేదికపైకి చేరారు.. ఎలా స్పందిస్తారోనని కార్యకర్తల్లో, అభిమానుల్లో ఉత్కంఠ.. ఈ పరిస్థితికి తెర దించుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దసరా వేదికపై ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, ఆలింగనం చేసుకున్నారు. సంగారెడ్డిలో దసరా వేడుకల నిర్వహణపై చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పట్టణంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. కరపత్రాలు పంచారు. దీంతో దసరా రోజు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే, గురువారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన దసరా వేడుకల సందర్బంగా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఎలాంటి వివాదాల జోలికి పోలేదు. రామమందిరం నుంచి వేడుకలు జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు.

ఈ సమయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆయన నేరుగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి పలకరించారు. ప్రభాకర్ సైతం జగ్గారెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో దసరా వేడుకలకు హాజరైన ప్రజలు, ఇరువురు నేతల అనుచరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మొదటగా ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదు. గతేడాది ఓడిపోయినందున వేడుకలకు హాజరుకాలేదని ఇకపై వేడుకలకు హాజరువుతానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న చింతా ప్రభాకర్‌ను గౌరవిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జగ్గారెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవన్నారు. మొత్తంగా ఇద్దరు నేతల కలయిక అందరినీ ఆకర్షించింది.

మరిన్ని వార్తలు