ఈ వాహనంపై రయ్‌ రయ్‌

8 Jan, 2019 08:59 IST|Sakshi
అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో అందుబాటులో ఉంచనున్న ‘ఈ– బైక్స్‌’

మెట్రో రైల్‌ దిగడమే ఆలస్యం.. కార్లు, బైక్‌లు సిద్ధం  

ఉపయుక్తంగా ఉందంటున్న వినియోగదారులు      

సనత్‌నగర్‌: ‘మెట్రో’లో నగర అందాలను వీక్షిస్తూ గగన విహార అనుభూతులను పొందిన  అనంతరం గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ–కార్లు, ఈ– బైక్‌లు సిద్ధంగా ఉంటున్నాయి. విధులు ముగించుకుని మళ్లీ మెట్రోస్టేషన్‌ వద్ద వాహనాన్ని వదిలి అదే మెట్రోలో సాగిపోయే వెసులుబాటు ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు ఊరటనిస్తోంది. ఈ కార్లు, బైక్‌లు, సైకిళ్లు అమీర్‌పేటతో పాటు మెట్రో రాకపోకలు జరుగుతున్న నాగోలు– అమీర్‌పేట, అమీర్‌పేట– మియాపూర్‌ మార్గాల్లోని సగానికి పైగా స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అద్దె కూడా చాలా తక్కువ ఉండడంతో ఆయా వాహనాలకు ప్రయాణికుల నుంచి భారీగానే స్పందన వస్తోంది.

అమీర్‌పేటలో ‘ఈ– బైక్స్‌’
అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ కేంద్రంగా ఈ– బైక్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్ట్‌ 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కి.మీటర్‌కు రూ.4 మేర చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. రాత్రివేళల్లో రూ.1 చెల్లించి వాహనాలను తీసుకువెళ్లవచ్చు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మున్ముందు మరిన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్‌డీఎస్‌ ఎకో మోటార్స్‌ డైరెక్టర్‌ దీపికారెడ్డి తెలిపారు.  

‘డ్రైవ్‌జీ’ సేవలు..  
బాలానగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట మెట్రోస్టేషన్లలో ప్రస్తుతం ‘డ్రైవ్‌జీ’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 125 యాక్టివా వాహనాలను ‘డ్రై వ్‌జీ’ సంస్థ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచింది. మూడు స్టేషన్లలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరో వారం రోజుల్లో మెట్టుగూడ, తార్నాక, ప్రకాష్‌నగర్, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లలో డ్రై వ్‌జీ యాక్టివా వాహనాలను మెట్రో ప్రయాణికుల ముంగిటకు తీసుకురాన్నట్లు సంస్థ నిర్వాహకుడు దిలీప్‌ తెలిపారు. కి.మీటర్‌కు రూ.3 చొప్పున, గంటకు అద్దె రూ.6 చొప్పున వసూలు చేస్తున్నారు.  డ్రైవ్‌జీ వాహనాలను బుక్‌ చేయాలంటే ‘డ్రైవ్‌ జీ’ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

మియాపూర్‌మెట్రోస్టేషన్‌ వద్ద ‘ఈ– కార్స్‌’
మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ‘జూమ్‌కార్‌’ సంస్థ 25 ఎలక్ట్రికల్‌ కార్లు (ఈ–కార్స్‌) అందుబాటులో ఉంచింది. గంటకు రూ.40ల మేర రుసుం వసూలు చేస్తున్నారు. ఒకవేళ కిలోమీటర్ల విషయానికొస్తే  మొదటి 20 కి.మీటర్ల వరకు ఉచితంగానే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తుండగా, ఆ తర్వాత నుంచి కి.మీటరుకు రూ.8 చొప్పున వసూలు చేస్తారు. ఒక్క మియాపూర్‌ స్టేషన్‌ కేంద్రంగా రోజుకు 100 మంది ఈ–కార్స్‌ను వినియోగించుకుంటున్నట్లు సంస్థ నిర్వాహకులు సంతోష్‌రెడ్డి చెప్పారు.   

రిమ్‌జిమ్‌ రిమ్‌జిమ్‌సైకిల్‌వాలా..
పర్యావరణహిత బైక్‌లే కాదు.. సైకిళ్లను కూడా మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. జూమ్‌కార్‌ సంస్థ బేగంపేట, రసూల్‌పురా, ప్యారడైజ్, మెట్రో స్టేషన్లలో ఒక్కో స్టేషన్‌లో 20 చొప్పున ‘పెడల్‌’ కంపెనీ సైకిళ్లను అందుబాటులో ఉంచింది. అరగంట సమయానికి రూ.3  వసూలు చేస్తున్నారు. రోజుకు 800 మందికి పైగా ఈ సైకిళ్లను నియోగించుకుంటున్నారు. వీటితో పాటు జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, మియాపూర్, కూకట్‌పల్లి మెట్రోస్టేషన్లలో హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ సహకారంతో స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులో ఉంచారు.   

పర్యావరణపరిరక్షణకుపెద్దపీట...
మెట్రో ప్రయాణం అంతా పర్యావరణహితంగా జరగాలన్నది హెచ్‌ఎంఆర్‌ ప్రధానోద్దేశం.  ఇందుకోసం ఆయా స్టేషన్ల నుంచి ఈ–కార్స్, ఈ– బైక్స్‌ను అందుబాటులో ఉంచాం.   – సారిక,హెచ్‌ఎంఆర్‌ ఉద్యోగి.

సమయం కలిసివస్తోంది  
మెట్రో రాకతో నగరంలో రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండాపోయింది. మెట్రో దిగగానే బైక్‌లు, కార్లను తీసుకుని తమ గమ్యస్థానానికి వెళ్ళే వెసులుబాటు ఉండడం వల్ల ఎంతో సమయం కలిసివస్తోంది.      – సాయికుమార్, వినియోగదారుడు

ఛార్జీలు చాలాతక్కువ..  
ఈ– బైక్స్, కార్ల చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆటో, క్యాబ్‌లో వెళ్లాలంటే కనీసం రూ.50– రూ.100పైమాటే. అదే ఇక్కడి వాహనాలతో రూ.20లోపే పని ముగిసిపోతుండడం సంతోషదాయకం.
    – జునైదు, వినియోగదారుడు.

మరిన్ని వార్తలు