ట్రాఫిక్‌ చీఫ్‌కూ ఈ–చలాన్‌

16 Nov, 2018 02:14 IST|Sakshi

నెటిజనుడి ట్వీట్‌కు స్పందించిన పోలీసులు

రాంగ్‌ పార్కింగ్‌ చేసినందుకు రూ.235 ఫైన్‌

తక్షణమే చెల్లించిన అనిల్‌కుమార్‌ డ్రైవర్‌

సాక్షి, హైదరాబాద్‌: నగర ట్రాఫిక్‌ చీఫ్‌గా వ్యవహరించే అదనపు పోలీసు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ వాహనానికీ జరిమానా తప్పలేదు. ఆయన వాహనాన్ని డ్రైవర్‌ నో పార్కింగ్‌ ఏరియాలో ఉంచారు. ఈ రాంగ్‌ పార్కింగ్‌ వ్యవహారాన్ని ఓ నెటిజనుడు తన కెమెరాలో బంధించి ట్రాఫిక్‌ వింగ్‌కు ట్వీట్‌ చేశాడు. స్పందించిన అధికారులు తక్షణమే ఈ–చలాన్‌ జారీ చేయడంతోపాటు బాధ్యుడితో ఫైన్‌ కూడా కట్టించారు.

అనిల్‌కుమార్‌ గత కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ ట్రాఫిక్‌ ఠాణాలతోపాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్‌జోన్‌ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు అనిల్‌కుమార్‌తో పాటు డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ సైతం వచ్చారు.

సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన ఈ అధికారులు తమ వాహనాలు దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహనాల డ్రైవర్లకే ఉంటుంది. అనిల్‌కుమార్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన నోపార్కింగ్‌ బోర్డు ఉంది.


నెటిజనుడి ఫొటోతో వెలుగులోకి..
ఇలా రాంగ్‌ పార్కింగ్‌లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినదని చెప్పే ఆనవాళ్లు ఉండటం గమనించిన ఓ నెటిజనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్‌ పోలీసు అధికారిక ట్విట్టర్‌ ఖాతాకు ట్వీట్‌ చేశాడు.

స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధిస్తూ ఈ–చలాన్‌ జారీ చేశారు. ఇది తెలుసుకున్న అనిల్‌కుమార్‌ ఆరా తీయగా డ్రైవర్‌ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్‌ క్లోజ్‌ చేయించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్‌ చీఫ్‌ సదరు డ్రైవర్‌కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు