ఒక్క నెల.. 4.8 కోట్లు..

1 Sep, 2019 02:31 IST|Sakshi

లేజర్‌ గన్‌ షాట్‌ !

సాక్షి, హైదరాబాద్‌ : ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. ఖాళీగా కనిపిస్తే చాలు వాహనదారులు రయ్యిమంటూ దూసుకుపోతు న్నారు. జామ్‌.. జామ్‌.. అంటూ సాగిపోతున్నారు. కానీ రెండు మూడ్రోజులకు ఈ–చలాన్‌ వచ్చి చుక్కలు కనిపించేలా చేస్తుంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని లేజర్‌గన్‌ స్పీడ్‌ కెమెరాల ద్వారా క్లిక్‌మనిపించి ఇంటికే చలాన్‌లు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు చలాన్‌ల జారీని పరిశీలిస్తే.. ప్రతి నెలా రూ.4.8 కోట్లు ట్రాఫిక్‌ పోలీసు విభాగానికి  వాహన దారులు చెల్లిస్తున్నారు. ఇరు కమిషనరేట్ల పోలీసులు కలసి తొమ్మిది లేజర్‌గన్‌ కెమెరాల ద్వారా వాహనదారుల అధిక వేగాన్ని నిర్ధారిస్తున్నారు. 

వేగం తగ్గించినా మారని తీరు...
ఓఆర్‌ఆర్‌పై వాహనాల గరిష్ట వేగాన్ని 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్‌ జోష్‌ మాత్రం తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో తేలినా వాహనదారులు తగ్గడంలేదు. ఈ ఏడాది జరిగిన 82 రోడ్డు ప్రమాదాల్లో 33 మంది మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను చూస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. 

డ్రంకన్‌ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా...
ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం కొన్ని సందర్భాల్లో డ్రంకన్‌ డ్రైవ్‌ అని తేలడంతో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 1,836 వరకు కేసులు నమోదు చేశారు. వీరిలో 430 మందికి ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఇతరులకు న్యాయస్థానం రూ.45 లక్షల వరకు జరిమానా విధించింది. అటు లేజర్‌ గన్‌ కెమరాలు, ఇటు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలతో ఓఆర్‌ఆర్‌ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చడంపై ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెబుతున్నారు. 

ఆటోమేటిక్‌తో ఈ–చలాన్‌..
ఇప్పటివరకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ పోలీసులు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో లేజర్‌ గన్‌ కెమెరాతో వాహనదారుల స్పీడ్‌ను గమనిస్తున్నారు. ఇకపై ఈ వెతలు తీరున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్‌ కెమెరా రాడార్ల సాయంతో వాహనాల వేగాన్ని గుర్తించి చలాన్‌ జనరేట్‌ చేయనుంది. ఈ లేజర్‌ గన్‌ కెమెరా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సందర్శించి పనితీరు తెలుసుకున్నారు. ఇది విజయవంతమైతే ఓఆర్‌ఆర్‌ అంతటా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు.

ఓఆర్‌ఆర్‌ విస్తీర్ణం : 158 కిలోమీటర్లు
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 2,31,795
సైబరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో నమోదైన డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు : 1,569
జరిమానా : రూ.23,92,75,225
రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 96,628
జరిమానా : రూ.9,97,90,880
7 నెలల కాలంలో వాహనదారులకు అందిన ఈ–చలాన్‌ల మొత్తం : రూ. 34కోట్లు

మరిన్ని వార్తలు