టూరిస్ట్‌ స్పాట్స్‌లో ‘ఈ–సైకిల్‌’ పెట్రోలింగ్‌

3 Mar, 2018 03:25 IST|Sakshi
బైసైకిల్‌ పై నగర కొత్వాల్‌ వీవీ శ్రీనివాసరావు. చిత్రంలో ఇతర పోలీసు అధికారులు

కాలుష్యంతో పాటు ప్రమాదాలు నిరోధించేందుకే..

ప్రయోగాత్మక బై సైకిల్‌ను పరిశీలించిన నగర కొత్వాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం ద్విచక్ర వాహనాలు, ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్‌ డివిజన్‌లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్‌ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్‌ లేదా డీజిల్‌ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు ఈ–సైకిల్స్‌ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను తొలి దశలో టూరిస్ట్‌ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్‌ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఐఐటీ విద్యార్థులు టీ–హబ్‌లో ఏర్పాటు చేసిన స్టార్టప్‌ కంపెనీ ఓ తరహాకు చెందిన ఈ–సైకిల్‌ను రూపొందించింది. దీని పనితీరును కొత్వాల్‌ శుక్రవారం తన కార్యాలయంలో పరిశీలించారు.

ఇవే మోడల్స్‌ లేదా ఇదే తరహాకు చెందిన ఈ–సైకిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలి దశలో ట్యాంక్‌బండ్‌ చుట్టూ సంచరించే లేక్‌ పోలీసులతో పాటు కేబీఆర్‌ పార్క్, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ సైకిల్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 50 కి.మీ. నడుస్తుంది. ఒక్కసారి ఫెడల్‌ చేస్తే సార్టయ్యే ఈ బై సైకిల్‌ ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఈ బై సైకిల్‌ను టూరిజం పోలీసింగ్‌తోపాటు బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. గరిష్టంగా మూడు నెలల్లో వీటిని పోలీసు విభాగంలోకి తీసుకురావాలని భావిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు