ఇక అంతా.. ఈ–పాలన

28 Jul, 2019 08:14 IST|Sakshi

సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్‌) :  ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ –2018 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనతో పాటు గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, అధికారులకు పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ–పాలన ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత నెలలో జిల్లాస్థాయి అధికారులతో పాటు డీపీఎంలకు పంచాయతీరాజ్‌ చట్టంపై శిక్షణ కల్పించింది. వీరు ఆయా మండలాల్లో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నారు. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామాన్ని ఇక ఈ–పంచాయతీ దిశగా మార్చేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 157 కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ల వారీగా విధులు నిర్వర్తించే వారు. వీరికి గతంలో 171 వరకు కంప్యూటర్లను అందించారు. మూడు, నాలుగు పంచాయతీలకు చొప్పున 
క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించి ప్రజలకు సేవలందించారు.

సరైన వేతనాలు లేక పోవడం, శిక్షణ ఇవ్వకపోవడం, జీతాలు సక్రమంగా రాకపోవడంతో చాలా చోట్ల కంప్యూటర్‌ ఆపరేటర్లు అందుబాటులో లేరు. దీంతో ఆయా పంచాయతీలకు మంజూరైన కంప్యూటర్లు మూలనపడ్డాయి. మండల కార్యాలయాల్లోనే ఒక గదిని ఏర్పాటు చేసి ఉన్న కొంత మంది ఆపరేటర్లతోనే ఆయా పంచాయతీలకు సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

గ్రామ కార్యదర్శులు పంచాయతీల్లో ఉండలేక మండల కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో నూతనంగా ప్రతీ గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించారు. విధుల్లో చేరిన వారికి కంప్యూటర్లపై అవగాహన ఉంది. వీరికి కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తే గ్రామాల్లోనే పారదర్శకమైన పాలన అందించే అవకాశం ఉంది.  

కొనసాగుతున్న శిక్షణ శిబిరాలు
జిల్లాలోని పాపన్నపేట, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నర్సాపూర్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, కౌడిపల్లి, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణాలు, బిల్లులు, లేఅవుట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ మంజూరు, రెన్యూవల్స్, ఇతర సిటిజన్‌ సర్సీసులను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టడంపై నూతన గ్రామ కార్యదర్శులకు ఈ–పంచాయతీలపై శిక్షణ కల్పించారు. 

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఈ–పంచాయతీపై జిల్లాలోని ఆయా మండలాల్లో పాత, కొత్త గ్రామ కార్యదర్శులకు కలిపి ప్రొజెక్టర్‌ ద్వారా శిక్షణ కల్పిస్తున్నాం. ఈ–పంచాయతీ ద్వారానే రాబోయే రోజుల్లో పాలన కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో ఆయా పంచాయతీలకు కంప్యూటర్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామకార్యదర్శులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. 
– భానుప్రకాష్, డీపీఎం, మెదక్‌ 

>
మరిన్ని వార్తలు