గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

15 Jul, 2019 13:27 IST|Sakshi

25 నుంచి 35  శాతం లబ్ధిదారులకు సరుకులకు దూరం 

అవసరం లేకపోయినా ఆహారభద్రత కార్డు  

సాక్షి, వికారాబాద్‌: ప్రజా పంపిణీ వ్యవస్థలో అమలులోకి వచ్చిన ఈ–పాస్‌ విధానం అనర్హుల గుట్టువిప్పుతోంది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో సుమారు 25 నుంచి 35 శాతం వరకునిందుకు అనర్హులని స్పష్టమవుతోంది.  ఏడాదిగా ప్రతి నెల సరుకుల డ్రాకు దూరం ఉంటున్న కుటుంబాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పీడీఎస్‌ బియ్యం అవసరం లేనివారు సరుకులకు దూరంగా ఉంటోన్నట్లు తెలుస్తోంది.  ప్రతి కుటుంబానికి బియ్యం అవసరం ఉంటుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర రూ.50 పైగా పలుకుతోంది. నాణ్యతను బట్టి ధర ఎక్కువగా ఉంటోంది. మార్కెట్‌ ధర ప్రకారం బియ్యం  కొనాలంటే దారిద్యరేఖకు దిగువ నున్న నిరుపేద కుటుంబాలకు పెను భారమే.

ప్రభుత్వ చౌకధరల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం ధర కిలో రూ.1 మాత్రమే. కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున ప్రతి నెల రేషన్‌ కోటా విడుదల చేస్తోంది. అయితే ప్రతి నెల ఆహార భద్రత కార్డు దారుల్లో కొన్ని కుటుంబాలు సరుకులను తీసుకోవడం లేదు. ఒక వేళ స్థానికంగా లేకున్నా  రాష్ట్ర, జిల్లా పోర్టబిలిటి విధానంలో ఎక్కడైనా డ్రా చేసుకునే వెసులు బాటు ఉంటుది. అయినా సరుకుల డ్రా కు మాత్రం దూరం పాటిస్తున్నారు.  బహిరంగ మార్కెట్‌ ధర కంటే 50 రెట్ల తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేస్తున్నా పలువురు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన బియ్యాన్నే రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నా ఆహార భద్రత కార్డుదారులు మాత్రం బియ్యం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

వెసులు బాటుతో... 
పేదల బియ్యం పక్కదారి పడుతుండటంతో దానికి అడ్డుకట్టవేసేందుకు పౌరసరఫరాల శాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నుంచి వరసగా సరుకులు డ్రా చేయని కుటుంబాల ఆహార భద్రత కార్డులను ఎట్టి పరిస్ధితిల్లో తొలగించబోమని సరిగ్గా ఏడాది క్రితం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ప్రకటించారు. అప్పటి వరకు  కార్డు రద్దవుతుందని కొందరు అప్పుడప్పుడు బియ్యం కొనుగోలు చేస్తుండగా, మరికొందరు బియ్యం కొనుగోలు చేసి కిరాణం, టిఫిన్‌ సెంటర్లకు రూ.10 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఆహార భద్రత కార్డుదారుల్లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలు ఉండటంతో రేషన్‌ బియాన్ని కేవలం అల్పహార తయారీకి మా త్రమే వినియోగిస్తుంటారు. రేషన్‌ బియ్యం అవసరం పెద్దగా ఉండదు.  సరుకులు డ్రా చేయ కున్నా పర్వాలేదన్న వెసులు బాటుతో  ఇక సరుకులు డ్రా చేయడమే నిలిపివేసినట్లు తెలుస్తోంది.  

అవసరం లేకపోయినా.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. గతంలో తెల్లరేషన్‌ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు మధ్య తరగతి, ప్రయివేటు ఉద్యోగులు సైతం భారీగా ఆహార భద్రత కార్డులు పొందారు.  ప్రభుత్వం కార్డు దారుడి కుటుంబంలో సభ్యుడు (యూనిట్‌)కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా  కేటాయిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు మ్యానువల్‌ పద్దతిలో బియ్యం పంపిణీ కొనసాగేది. గత రెండేళ్ల క్రితం ఈ–పాస్‌ ద్వారా సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది.

దీంతో రేషన్‌ బియ్యం అత్యవసరం లేనివారు రెండు మూడు నెలలకోసారి బియ్యం కొనుగోలు చేసి కార్డు రద్దు కాకుండా కాపాడుకుంటున్నారు.  బియ్యం తీసుకోకున్నా కార్డులు రద్దు చేయబోమని  అధికారులు ప్రకటించడం బియ్యం అవసరం లేని వారికి ఉపశమనం కలిగినట్లయింది. బియ్యం అవసరం లేని మధ్య తరగతి వర్గాలకు ఆహార భద్రత కార్డు అవసరమా,,? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 
   

మరిన్ని వార్తలు