ఎకానమీని ప్రభావితం చేసే ఈ–పేమెంట్లు: గవర్నర్‌

19 Mar, 2019 02:39 IST|Sakshi
గవర్నర్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న బీపీ ఆచార్య తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఈ–పేమెంట్లు, ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఆర్థిక వ్యవస్థను ఈ పేమెంట్లు ప్రభావితం చేస్తాయని తెలిపారు. ‘ఈ–పేమెంట్లు, ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత’అనే అంశాలపై ఆసియా దేశాలకు చెందిన సివిల్‌ సర్వెంట్లకు ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ సంస్థ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని నరసింహన్‌ సోమవారం రాజ్‌భవన్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థ ద్వారా 2020 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశముందని అన్నారు. తద్వారా ఇండియా జీడీపీ 15 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. బలహీనవర్గాల ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచేలా పొదుపు, పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీల్లో భాగస్వాములను చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ హర్‌ ప్రీత్‌ సింగ్, ఇండోనేసియా, కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియాల సివిల్‌ సర్వెంట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు