గనుల శాఖలో ‘ఈ- పర్మిట్’

8 Jun, 2014 23:41 IST|Sakshi
గనుల శాఖలో ‘ఈ- పర్మిట్’

తాండూరు, న్యూస్‌లైన్: గనుల శాఖలో కొత్తగా ఈ -పర్మిట్ విధానం అమల్లోకి రానున్నది. ఈ విధానం ద్వారా లీజుదారులు ఇకపై గనుల నుంచి ముడిసరుకు తరలించేందుకు మైన్స్ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదు. ఏడాది క్రితం గనుల లీజుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పుడు పర్మిట్‌ల జారీకి కూడా ఆన్‌లైన్ విధానాన్ని అమలోకి తేనున్నారు.

ప్రస్తుతం గనుల శాఖ లీజుదారులకు మ్యానువల్ పద్ధతిలో పర్మిట్‌లు జారీ చేస్తున్నది. ఈ పద్ధతిలో రవాణా చేయాలనుకున్న ముడిసరుకు పరిమాణం ప్రకారం లీజుదారులు స్థానిక ట్రెజరీలో చలానా చెల్లించి, గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో అందజేస్తారు. అనంతరం ముడిసరుకు రవాణాకు పర్మిట్‌లను జారీ చేస్తారు.
 
అయితే తరచూ అధికారులు కార్యాలయంలో లేకపోవడం, పర్మిట్‌లను ఓకే చేసేందుకు సిబ్బంది సతాయిస్తుండడం తదితర కారణాల వల్ల లీజుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తద్వారా ముడిసరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి లీజుదారులకు విముక్తి కల్పిస్తూ పర్మిట్‌ల కోసం వారు మైన్స్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ -పర్మిట్ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
 
ఈనెల 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం పది జిల్లాల్లో అమల్లోకి తీసుకువచ్చేందుకు గనుల శాఖ సంచాలకులు ఇప్పటికే మైన్స్ ఏడీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ -పర్మిట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాలో గత ఏడాది మార్చిలోనే అమలు చేయగా విజయవంతమైంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ విధానం అమలుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రానైట్, సుద్ధ, కంకర, షేల్‌తోపాటు తదితర చిన్నాపెద్ద తరహా ఖనిజాల రవాణాకు ఇక నుంచి ఈ -పర్మిట్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో పర్మిట్‌లు జారీ చేస్తారు. ఈ విధానం అమలుకు గనుల శాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేస్తున్నది. లీజుదారులకు గనుల శాఖ ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర పది బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నది.
 
నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు ముడిసరుకు రవాణాకు పర్మిట్ కోసం డబ్బులను గనుల శాఖ ప్రధాన పద్దులో జమ చేస్తారు. అయితే లీజుదారులకు గనుల శాఖ ప్రత్యేకంగా ఐడీ నంబరును కేటాయిస్తున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు పర్మిట్ డబ్బులు జమ చేయగానే మైన్స్ ఏడీ సెల్‌ఫోన్‌లో ఇందుకు సంబంధించిన సమాచారం వస్తుంది. ప్రత్యేకంగా కేటాయించిన ఐడీ ద్వారా లీజుదారుడు ఎవరు, గని సర్వేనంబర్ తదితరాలతోపాటు లీజు కాలం వంటి వివరాలూ తెలుస్తాయి.
 
అనంతరం ఏడీలు తమ డిజిటల్ సంతకంతో కూడిన పర్మిట్‌లను ఆన్‌లైన్‌లో లీజుదారునికి పంపిస్తారు. ఆన్‌లైన్‌లో వచ్చిన పర్మిట్‌లను లీజుదారులు ప్రింట్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకొని, ముడిసరుకును రవాణా చేసుకుంటారు. సిమెంట్ కర్మాగారాలు ఉన్నప్రాంతాల్లో సిమెంట్ గ్రేడ్ లైమ్‌స్టోన్‌కు మాత్రమే ఈనెల 9 నుంచి ఈ -పర్మిట్ విధానం అమలు చేయడానికి గనుల శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇతర చిన్నాపెద్ద తరహా ఖనిజాల ముడిసరుకు రవాణాకు ఈ విధానం సాధ్యమైనంత తొందరగా అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మైన్స్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు