ప్రతి పథకమూ పారదర్శకం

12 Dec, 2017 03:14 IST|Sakshi

     అందుబాటులోకి ‘డీబీటీ భారత్‌’వెబ్‌సైట్‌ 

     రాష్ట్రాలు, పథకాల వారీగా సమాచారం 

     పారదర్శకంగా పథకాల అమలుకే: కేంద్రం 

     నగదు బదిలీతో రూ.57,029 కోట్లు ఆదా 

     అన్ని పథకాలకూ విస్తరించే యోచనలో సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు ప్రతి పథకం వివరాలు అందుబాటులో ఉంచి పథకాల అమలులో పారదర్శకతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్రం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు ‘డీబీటీ భారత్‌’పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాల్లో ఎంత మేర లబ్ధిదారులకు చేరింది, ప్రభుత్వానికి ఎంత ఆదా అయింది తదితర వివరాలను అందులో పొందుపరిచింది. సమాచారాన్ని పక్కాగా అందుబాటులో ఉంచేందుకు అన్ని రాష్ట్రాల్లో డీబీటీ సెల్‌లు ఏర్పాటు చేసింది. వివిధ పథకాల సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే నగదు బదిలీ విధా నాన్ని కేంద్రం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గ్యాస్‌ సబ్సిడీతో మొదలైన విధానాన్ని మెల్లగా ఇతర పథకాలకూ విస్తరిస్తోంది.  

ఎల్పీజీ.. రూ.29 వేల కోట్లు ఆదా.. 
నాలుగేళ్లుగా ఎల్పీజీ గ్యాస్‌ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్రం.. దాని ద్వారా తొలి ఏడాదిలోనే రూ.29 వేల కోట్లు ఆదా అయినట్లు లెక్క తేల్చింది. దీంతో మిగతా పథకాల సబ్సిడీలనూ నేరుగా లబ్ధిదారులకే చేరవేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూలీ ల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. జాతీయ సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులకు చెల్లించే పెన్షన్లనూ నేరుగానే పంపిణీ చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేసే రేషన్‌ సరుకుల సబ్సిడీనీ నేరుగా అందించే కార్యాచరణను కూడా చేపట్టింది. డీబీటీ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ధనం భారీగా ఆదా అవుతోందని, దీని ద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయగలిగామని వెబ్‌సైట్‌లో కేంద్రం వెల్లడించింది. డీబీటీతో 2016–17లో రూ.57,029 కోట్లు ఆదా అయినట్లు లెక్క తే ల్చిన కేంద్రం.. ఆ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  

అన్ని పథకాలు డీబీటీ పరిధిలోకి..! 
దేశంలో 395 పథకాలు అమలు చేస్తున్న కేంద్రం.. ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ శాఖలో అమలులో ఉన్న విత్తన పంపిణీ మొదలు డ్రిప్‌ ఇరిగేషన్‌ వరకు, వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి శిక్షణ, ఉపాధి హామీ నిధులు, అంగన్‌ వాడీ పథకాలు.. ఇలా అన్నింటికీ సబ్సిడీలు చెల్లిస్తోంది. వీటిలో కొన్నింటి సొమ్ము ఇప్పటికే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతోంది. అయితే కొన్ని పథకాలకు సంబంధించిన సబ్సిడీలు ముందుగా ఆయా శాఖలకు చేరుతుండటంతో సబ్సిడీ సొమ్ము వివిధ రకాలుగా దుర్వినియోగమవుతున్నట్లు తెలిసింది. దీంతో ఉపాధి హామీ, గ్యాస్, కిరోసిన్, రేషన్‌ బియ్యం, స్కాలర్‌షిప్, పెన్షన్లు నేరుగా లబ్ధిదారులకే అందేలా డీబీటీ విధానం తీసుకొచ్చింది. నిధుల దుర్వినియోగం జరగకపోవడం, భారీగా ప్రభుత్వ ధనం ఆదా అవుతుండటంతో సబ్సిడీతో ముడిపడి ఉన్న మిగతా పథకాలనూ డీబీటీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. 

రాష్ట్రాలకు బంపర్‌ ఆఫర్‌.. 
ప్రస్తుతం ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే రేషన్‌ సరుకులపై కేంద్ర సబ్సిడీ నేరుగా రాష్ట్ర ఖాతాలో జమవుతుంది. అయితే సబ్సిడీని లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా జమ చేస్తే దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన కేంద్రం.. గతేడాది నుంచి అన్ని రాష్ట్రాలను ఆ దిశగా అప్రమత్తం చేసింది. డీబీటీతో ఆదా చేసిన సొమ్మును రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం పంపించాలని, కేంద్ర పథకాలను అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలను డీబీటీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కోరింది. అయితే ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగింది, ప్రభుత్వ పథకాలేమేం అందాయి, లబ్ధి పొందని కుటుంబాలెన్ని అనే కోణంలో ఈ డేటాను కేంద్రం సమీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల వారీగా ఆధార్‌ లింకేజీ పూర్తయినందున ఏయే పథకాల్లో ఎవరు, ఎంతమేర లబ్ధి పొందారో క్షణాల్లో వివరాలు తెలుసుకోవచ్చని.. ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాలకూ అది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. 

>
మరిన్ని వార్తలు