మే చివర్లో ఎంసెట్‌!

14 Apr, 2020 01:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అంతకంటే ముందే ఈ–సెట్, జూన్‌లో మిగతా సెట్స్‌

మే నెలలో టెన్త్‌ పరీక్షలు, జూన్‌/జూలైలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ మే నెల చివరిలో జరిగే అవకాశం ఉంది. వైరస్‌ నియంత్రణ కోసం ఈ నెలాఖరు 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్‌) ఉన్నత విద్యా మండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలన్న ఆలోచనల్లో సెట్స్‌ కమిటీలు పడ్డాయి. ఈనెలాఖరు కల్లా రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని భావిస్తున్న అధికారులు మే నెల మూడో వారంలో ఈ–సెట్‌ను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. ఎంసెట్‌ను మే మూడో వారంలో ప్రారంభించి జూన్‌ 1వ తేదీకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈలోగా ఇంటర్మీడియెట్‌ ఫలితాలు వెలువడుతాయి కనుక విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా చూడవచ్చన్న ఆలోచనలో ఉన్నారు.

మెుత్తానికి ఈసెట్, ఎంసెట్‌ను జూన్‌ ప్రారంభం నాటికి పూర్తి చేస్తే.. ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పీజీఈసెట్, లాసెట్‌ను జూన్‌ 20వ తేదీలోగా పూర్తి చేసేలా, జూలైలో ప్రవేశాలను చేపట్టవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇక పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్‌ను కూడా మే నెలాఖరుకు నిర్వహించే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే పదో తరగతి పరీక్షలను మే మెుదటి వారంలో నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. తద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడవచ్చని భావిస్తున్నారు. మే నెల మెుదట్లో టెన్త్‌ పరీక్షలను నిర్వహించి జూన్‌లో ఫలితాలను వెల్లడించే అవకాశాలను పరిశీలిస్తోంది. జూన్‌/జూలైలో టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ 
సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు