ఆన్‌లైన్‌లోనే ఎంసెట్‌ 

28 Nov, 2017 03:08 IST|Sakshi

ఉన్నత విద్యా మండలి సమావేశంలో నిర్ణయం

రోజుకు రెండు సెషన్లుగా పరీక్ష 

ఒక్కో సెషన్‌లో 30 వేల మంది

అభ్యర్థుల సంఖ్యను బట్టి నిర్వహించే రోజులు ఖరారు

గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు

వచ్చే నెల 10న విధి విధానాలు.. 20వ తేదీలోగా పరీక్షల తేదీలు ఖరారు

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు

ఎంసెట్‌ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూహెచ్‌కే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2018– 19) ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌–2018ను ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రోజుకు రెండు సెషన్లుగా ఒక్కో సెషన్‌లో 30 వేల మందికి పరీక్ష నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎన్ని రోజుల పాటు పరీక్ష నిర్వహించాలి, ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇక గతంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ప్రవేశపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినా.. ఆన్‌లైన్‌ పరీక్షలకు కంప్యూటర్‌ ల్యాబ్‌లు అవసరమైన దృష్ట్యా ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్‌ సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బాధ్యతలను టీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా టీసీఎస్‌కు అప్పగించనున్నారని.. టీసీఎస్‌తో టీఎస్‌ ఆన్‌లైన్‌ ఒప్పందం కుదుర్చుకోనుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

విధి విధానాలపై పాత కన్వీనర్లతో కమిటీ 
ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్షల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను వచ్చే నెల 10న ఖరారు చేయనుంది. ఇందుకోసం 2017–18 సెట్స్‌ నిర్వహించిన ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్‌ కన్వీనర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. విధి విధానాల రూపకల్పన పూర్తయ్యాక వచ్చే నెల 20వ తేదీలోగా ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమావేశమై పరీక్షల నిర్వహణ తేదీల ఖరారు, కన్వీనర్ల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తోంది. ఇక కీలకమైన ఎంసెట్‌–2018 నిర్వహణ బాధ్యతను మాత్రం జేఎన్టీయూహెచ్‌కే అప్పగించాలని నిర్ణయించింది. లాసెట్‌తోపాటు మరికొన్ని సెట్స్‌ను 2017లో నిర్వహించిన కన్వీనర్లు రిటైర్‌ కావడంతో ఈసారి కొత్త కన్వీనర్లను నియమించనుంది. లాసెట్‌ బాధ్యతలను 2017లో కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే లాసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ ఎంవీ రంగారావు రిటైర్‌ కావడం, కాకతీయ వర్సిటీలో లా ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో.. ఆ బాధ్యతలను ఉస్మానియా వర్సిటీకి అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో ఈసారి సెట్స్‌ ఫీజులు పెరిగే అవకాశముంది. ఎంత ఫీజు అన్నది సెట్‌ కమిటీ సమావేశంలో ఖరారు చేస్తారు. 

జిల్లాల వారీగా అవగాహన 
మొదటిసారిగా ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు యాజమాన్యాలే అవగాహన కల్పించనుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విద్యా మండలి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ మాక్‌ (నమూనా) టెస్టులను నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తారు. ఇక సెట్స్‌ వెబ్‌సైట్లలోనూ ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాక్టీస్‌ లింకులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు