19 నుంచి ఎంసెట్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌లు

8 Apr, 2018 03:21 IST|Sakshi

ఈ నెల 20 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు 

మే 2 నుంచి 7 వరకు ఎంసెట్‌ పరీక్షలు 

ఈ నెల 8 నుంచి అవగాహన తరగతులు 

జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పద్ధతిలో తొలిసారిగా జరిగే ఎంసెట్‌– 2018 ఆన్‌లైన్‌ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు జేఎన్‌టీయూ సరికొత్త అవకాశం కల్పించింది. పరీక్షపై అవగాహనకు ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ఈనెల 19, 20 తేదీల్లో ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్‌ పరీక్ష నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శనివారం జేఎన్‌టీయూలో రిజిస్ట్రార్‌ యాదయ్యతో కలిసి ఆయన మీడియాకు వివరిం చారు. ప్రాక్టీస్‌ టెస్టులకు హాజరుకావాలనుకున్న విద్యార్థులు ముందుగా www.eamcet. tsche.ac.inలో రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్‌ జోన్లలో 70 వేల మంది టెస్ట్‌కు హాజరయ్యేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వెబ్‌సైట్‌లో మాక్‌టెస్టులు రాసే అవకాశమూ కల్పించింది. ఒక విద్యార్థి ఎన్నిసార్లయినా మాక్‌టెస్ట్‌ రాయొచ్చని, దీంతో తుది పరీక్షలో ఎలాంటి ఆందోళనకు గురికారని అధికారులు చెబుతున్నారు. 

2,17,166 దరఖాస్తులు.. 
ఎంసెట్‌–2018కు 2,17,166 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,45,549 మంది ఇంజనీరింగ్, 71,617 మంది అగ్రికల్చర్, మెడిసిన్‌ విభాగం కింద దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు 2 రాష్ట్రాల్లో 168 కేంద్రాల ను ఏర్పాటు చేశారు. మే 2 నుంచి 7 వరకు ఎంసెట్‌ జరుగనుంది. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. రోజూ 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి 6  వరకు జరుగుతుంది. ఈ నెల 20 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు ఉంచుతారు.  

నిమిషం ఆలస్యమైనా.. 
తొలిసారిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రం లోనికి విద్యార్థులను అనుమతిస్తారు. దీనివల్ల విద్యార్థి ఎలాంటి గందరగోళానికి గురికాకుండా కంప్యూటర్‌లో వివరాలను సరి చూసుకునే వీలుంటుంది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని యంత్రాంగం స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావొద్దని సూచించింది. గోరింటాకు పెట్టుకోవద్దని, గోరింటాకు వల్ల వేలిముద్రలు సరిపోలకపోవచ్చని, ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. 

మొబైల్‌ యాప్‌ కూడా 
ఎంసెట్‌కు సంబంధించి యంత్రాంగం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో  TSCHE myCET  అని టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీంతో నోటిఫికేషన్‌తోపాటు సీబీటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. హాల్‌టికెట్‌ సైతం డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి మే 1 లోపు హాల్‌టికెట్‌ను తప్పకుండా డౌన్లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు, బాల్‌పాయింట్‌ పెన్‌ను తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. రఫ్‌ వర్క్‌ కోసం పరీక్ష కేంద్రంలోనే బుక్‌లెట్‌ ఇస్తారు.  

జవాబు మార్చుకోవచ్చు! 
ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సరికాదని విద్యార్థికి అనిపిస్తే మార్చుకునే వీలుంది. చివరి నిమిషంలో సరైన సమాధానం ఎంపిక చేసుకునే వీలుంది. గతంలో మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో ఈ అవకాశం లేకపోవడంతో తప్పుడు సమాధానం గుర్తించిన విద్యార్థులు నష్టపోయేవారు. తాజాగా సర్దుబాటుకు అవకాశం ఉండటంతో విద్యార్థులకు మార్కులు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక యూజర్‌ ఐడీ విద్యార్థి హాల్‌టికెట్‌పైనే ఉంటుంది. పాస్‌వర్డ్‌ మాత్రం పరీక్ష హాలుకి చేరుకున్న తర్వాత ఇస్తారు. 

పరీక్ష తీరుపై వీడియో 
పరీక్ష హాలులోకి ప్రవేశించినప్పటి నుంచి వివరాలు సరిచూసుకోవడం, ప్రశ్నలు చదవడం, జవాబులు ఎంపిక చేసుకోవడం, పరీక్ష ముగింపు తీరుపై యంత్రాంగం ప్రత్యేక వీడియో రూపొందించింది. విద్యార్థుల్లో ఆందోళన తొలగించేందుకోసం ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో ఈ వీడియోను అందుబాటులో ఉంచింది. యూట్యూబ్‌లో కూడా వీడియో అందుబాటులో ఉంచామని, ఈనెల 8 నుంచి ఆన్‌లైన్‌ ఎంసెట్‌పై అవగాహన తరగతులు నిర్వహించనున్నామని జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పది శాతం కంప్యూటర్లను అదనంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా