18న ఎంసెట్‌ ఫలితాలు

8 May, 2018 01:57 IST|Sakshi

నేడు ప్రైమరీ ‘కీ’ల విడుదల

10 వరకు అభ్యంతరాల స్వీకరణ.. నెలాఖరులో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌!

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం ఎంసెట్‌ పరీక్షలు పూర్తయినందున ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో అగ్రికల్చర్‌ కోర్సులకు ఎంసెట్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఎంసెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించింది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మంగళవారం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య తెలిపారు.

విద్యార్థులు తమ రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్‌ ర్యాంకులను ఈ నెల 18వ తేదీన ప్రకటించనున్నారు. ఇప్పటికే కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఏయే కాలేజీల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి...వాటి ఆధారంగా ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ప్రక్రియను జేఎన్‌టీయూహెచ్‌ పూర్తి చేసింది. ఫలితాలను వెల్లడించిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల జాబితాను అందజేయనుంది. మొత్తానికి ఈ నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

తెలంగాణలో ఇంజనీరింగ్‌ కోసం 94.25 శాతం హాజరు 
తెలంగాణలో ఎంసెట్‌ రాసేందుకు 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,19,270 మంది (94.25 శాతం) హాజరయ్యారు. అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ రాసేందుకు 63,653 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 58,744 మంది (92.29 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇంజనీరింగ్‌ కోసం 21365 మంది దరఖాస్తు చేసుకోగా 17,041 మంది (79.06 శాతం) హాజరయ్యారు. అగ్రికల్చర్‌ కోసం 9,425 మంది దరఖాస్తు చేసుకోగా 8,113 మంది (86.08 శాతం) విద్యార్థులు హజరయ్యారు.   

మరిన్ని వార్తలు