ఇంజనీరింగ్‌లో 27 వేల మందికి సీట్లు

13 Jul, 2018 03:03 IST|Sakshi

ఎంసెట్‌ రెండో దశ సీట్లు కేటాయింపు

కొత్తగా 13 వేల మందికి, స్లైడింగ్‌లో 14 వేల మందికి..

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్‌ రెండో దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ గురువారం ప్రకటించింది. కొత్తగా 13,206 మందికి సీట్లు లభించగా, తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీ మార్పు కోసం స్లైడింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న మరో 14,595 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా రెండో దశలో 27 వేలమందికిపైగా సీట్లను కేటాయించింది.

సీట్లు పొందిన విద్యార్థులు అలాట్‌మెంట్‌లెటర్లను   https://tseamcet.nic.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 52వేలమందికి సీట్లను కేటాయించినా, 38 వేల మందే కాలేజీల్లో చేరారు. మిగతా విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించినవారు 1,02,615 మంది ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనవారు 62,901 మంది ఉన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా వెరిఫికేషన్‌కు హాజరైనవారు 4,594 మంది ఉన్నారు.

17,876 సీట్లు ఖాళీ..
ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌–డి కోర్సులను నిర్వహిస్తున్న 302 కాలేజీల్లో 69,221 సీట్లు ఉండగా, అందు లో 51,345 మందికి సీట్లను (74.18%) కేటాయించింది. మరో 17,876 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలు 189 ఉండగా, వాటిల్లో 65,648 సీట్లు ఉన్నాయి. అందులో 51,157 సీట్ల (77.93%)ను ప్రవేశాల కమిటీ విద్యార్థులకు కేటా యించగా, 14,491 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.

ఇక 1,856 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు లభించలేదు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత మరో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది.

24 కాలేజీల్లో 50 మందిలోపే..: రాష్ట్రంలో 189 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉంటే.. అందులో 2 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 7 కాలేజీల్లో 9 మందిలోపే చేరగా, 24 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. మరో 43 కాలేజీల్లో 100 మందిలోపు చేరారు. 60 కాలేజీల్లో మాత్రం 100% కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 48 ప్రైవేటు కాలేజీలు ఉండగా, 12 వర్సిటీ కాలేజీలు ఉన్నాయి.

ఈ నెల 15లోగా ఫీజు చెల్లించండి..
సీట్లు లభించిన విద్యార్థులు అలాట్‌ మెంట్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ నెల 15లోగా ట్యూషన్‌ ఫీజు చెల్లించి(వర్తించేవారు), సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని క్యాంపు అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని, కాలేజీలో రిపోర్టు చేయనివారి సీటు రద్దవుతుందన్నారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన వారు 16లోగా కాలేజీల్లో ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలు ఇవ్వాలని, చివరి దశ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాకే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు.

డిగ్రీలోనూ మరో విడత కౌన్సెలింగ్‌..: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక విడత సీట్ల కేటాయింపును ప్రకటించనున్న డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌ ) మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తోంది. ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ప్రవేశాలు, ఎంసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక దీనిని నిర్వహించాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు