భూమికి మరో ముప్పు!

17 Mar, 2018 02:38 IST|Sakshi

1,600 అడుగుల సైజున్న భారీ గ్రహశకలం.. 

వేల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తోంది

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలంపేరు బెన్నూ.. ఇది వంద అంతస్తుల భవనం కన్నా ఎక్కువ సైజు ఉంటుందని అంచనా. 2135లో భూమిని ఢీకొడుతుందని నాసా ఆధ్వర్యంలో పనిచేస్తున్న నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌(నియో) చెబుతోంది. ఇంత భారీ సైజున్న గ్రహశకలం భూమివైపు రావడం చాలా అరుదు. సుమారు 6 కోట్ల ఏళ్ల కింద రాక్షసబల్లులను అంతమొందించింది ఇలాంటి భారీ గ్రహశకలమే. అందుకే బెన్నూ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. దీని బరువు దాదాపు 7,900 కోట్ల కిలోలు. ఇది గనుక భూమిని ఢీకొంటే మనిషి అన్నవాడు ఉండబోడని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

2135 డెడ్‌లైన్‌..
అంతరిక్షంలో కొన్ని చోట్ల భారీ సంఖ్యలో గ్రహశకలాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. కక్ష్య నుంచి బయటపడి ఇష్టారీతిగా తిరిగే కొన్ని గ్రహశకలాలు వేల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తుంటాయి. వీటిల్లో చాలా తక్కువ మాత్రమే భూమిని ఢీకొడతాయి. నియో అంచనా ప్రకారం 2135 సెప్టెంబర్‌ 25న బెన్నూ భూమిని ఢీకొట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో బెన్నూను ఎదుర్కొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకతో బెన్నూను ఢీకొట్టించాలని.. దీంతో అది దారితప్పి ముప్పు నుంచి భూమి బయటపడుతుందని అంచనా. అయితే అంతరిక్ష నౌకతో ఢీకొట్టించడం కన్నా అణుబాంబుతో గ్రహశకలాన్ని పేల్చేయడం మేలని కొంతమంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బోలెడన్ని అంతరిక్ష నౌకలను గ్రహశకలం వైపు పంపితే.. ఒక్కోదాన్ని ఢీకొన్నప్పుడల్లా బెన్నూ వేగం తగ్గుతూ వస్తుందని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. గ్రహశకలం చిన్నదైతే ఢీకొట్టేందుకు చాలా సమయం ఉందని తెలిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు మొదటి పద్ధతి సరిపోతుందని లారెన్స్‌ లివర్‌మూర్‌ నేషనల్‌ లేబొరేటరీకి చెందిన డేవిడ్‌ డియర్‌బార్న్‌ అంటున్నారు. అయితే అణుబాంబులతో పేల్చేయడం మేలైన పని అని ఓ తాజా అధ్యయనంలో తేలింది.

8 టన్నుల హ్యామర్‌..
బెన్నూను అణుబాంబులతో పేల్చేసేందుకు అమెరికాకు చెందిన నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ (ఎన్‌ఎన్‌ఎస్‌ఏ) అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోంది. హైపర్‌ వెలాసిటీ ఆస్టరాయిడ్‌ మిటిగేషన్‌ మిషన్‌ ఫర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ (హ్యామర్‌) అని పిలుస్తున్న ఈ అంతరిక్ష నౌక దాదాపు 8.8 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. అధిక వేగంతో ప్రయాణిస్తూ బెన్నూను ఢీకొనడం ఒక పద్ధతి. లేదంటే అణుబాంబులను మోసుకెళ్లి ఆ గ్రహశకలంపై వాటిని పేల్చేయడం రెండో పద్ధతి. మొదటి పద్ధతిని పాటిస్తే ఎంత శక్తి పుడుతుందో తెలుసా? హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 80 వేల రెట్లు ఎక్కువ. ఈ భారీ శక్తి కాస్తా గ్రహశకలం దారిని మార్చేస్తుందని, తద్వారా అది భూమికి దూరంగా జరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా. అయితే గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న బెన్నూను దారి మళ్లించేందుకు ఇది సరిపోదని.. అణుబాంబులతో ముక్కలు చేయడమే కరెక్ట్‌ అని ఎన్‌ఎన్‌ఎస్‌ఏ శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.
– సాక్షి హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు