పర్యావరణ నిర్లక్ష్య ఫలితమే కరోనా వైరస్..!

22 Apr, 2020 12:28 IST|Sakshi

ధ‌రిత్రి,  జీవ వైవిధ్యం ను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం

లేకుంటే ఇలాంటి వైరస్‌లు అనేకం మానవుడి అనుభవంలోకి: మ‌ంత్రి అల్లోల‌

నేడు ప్ర‌పంచ ధ‌రిత్రి దినోత్స‌వం 

సాక్షి, హైద‌రాబాద్ :  ధ‌రిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మాన‌వ మ‌నుగ‌డ సాధ్య‌మ‌ని, లేకుంటే క‌రోనా లాంటి వైరస్‌లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  ప్ర‌పంచ‌ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి  ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్ని  కూడా  ప‌ర్యావ‌ర‌ణానికి మ‌నం చేస్తున్న హాని వ‌ల్లేన‌ని గ్రహించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్‌లు సోకడం ముమ్మరమవుతుందనేది  మ‌హ్మ‌మ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయ‌ని ఈ సంద‌ర్బంగా తెలిపారు. (భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ)

మానవ తప్పిదాల వల్లే వైరస్‌లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైర‌స్‌లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప‌ర్యావరణ విధ్వంసంతోనే గతంలో  మెర్స్‌, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ, ఎబోలా లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేన‌ని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. (పుడమి తల్లికి ప్రణామం)

భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని మంత్రి అన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా  తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. ‘చెట్టు అంటే కలప కాదు, అదొక జీవ వ్యవస్థ అని గ్ర‌హించాలి. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సారాలు సంరక్షిస్తున్న‌ది అడవులతో కూడిన జీవ వ్యవస్థని గుర్తించాలి. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి, కొత్తగా మొక్క‌ల‌ను నాటండి’ అని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. (వరమా.. శాపమా!)

మరిన్ని వార్తలు