ఫీడర్లకూ ఎర్తింగ్‌ ముప్పు

11 Jul, 2019 09:17 IST|Sakshi

తరచూ ట్రిప్పవుతున్న వైనం

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నిర్వహణ లోపం వల్లే అంటున్న నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్‌ ఫీడర్లకు ఎర్తింగ్‌ ముప్పు తప్పడం లేదు. వినియోగదారుల గృహాల్లోనే కాదు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కూడా సరైన ఎర్తింగ్‌ సిస్టం లేకపోవడంతో సబ్‌స్టేషన్లలోని ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. నిజానికి లైన్ల పునరుద్ధరణ, నిర్వహణ కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏటా రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఈ పునరుద్ధరణ పనుల్లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, పాడైన ఇన్సులేటర్లు, కండక్టర్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చడం, లూజు వైర్లను సరి చేయడం, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్‌ లీకేజీలను అరికట్టడం, విద్యుత్‌ సరఫరాలో హె చ్చుతగ్గులకు కారణాలు గుర్తించి వాటిని సరి చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కోర్‌సిటీలో మినహా శివారు ప్రాంతాల్లోని సర్కిళ్ల పరిధిలో ఈ పనులను నిర్వహించకపోవడంతో ఫీడర్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి...విద్యుత్‌ సరఫరాలో అంతరాయానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే కొంత మంది ఇంజనీర్లు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి పునరుద్ధరణ పనుల పేరుతో సంస్థ ఖజానాను కొల్లగొడుతుండటం విశేషం.

నిర్వహణ లోపం.. తరచూ అంతరాయాలు:  ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటిలో 42 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, 7 లక్షలకుపైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. మరో 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 33/11కేవీ సబ్‌స్టేష న్లు 306, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 96882, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 802పైగా, 33కేవీ, 11కేవీ, ఎల్టీలైన్స్‌ 52142 కిమిపైగా ఉన్నాయి. రాజేంద్రనగర్, హబ్సి గూడ, సరూర్‌నగర్, సైబర్‌సిటీ, మేడ్చల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్‌ సౌత్, హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటం, కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు వెలుస్తుండటం వల్ల విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. 2006లో నగరంలో 24.12 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, 1538 మెగవాట్ల విద్యుత్‌ వినియోగం ఉండేది. 2019 మే 29న అత్యధికంగా 3391 మెగవాట్ల విద్యుత్‌ వినియోగం (73.84 ఎంయూ)జరగగా, ఆ తర్వాత రోజుకో ఎంయూ చొప్పున వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త లైన్లు, డీటీఆర్‌లు, ఫీడర్లు, సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ... వాటికి సరైన ఎర్తింగ్‌ సిష్టం ఏర్పాటు చేయక పోవడం, ఒక వేళ ఎర్తింగ్‌ సిష్టం ఏర్పాటు చేసిన ప్పటికీ..నిర్వహణ లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. 

చంపాపేట డివిజన్‌లో తరచూ కోతలు:  చంపాపేట డివిజన్‌ పరిధిలోని బైరమల్‌గూడ సెక్షన్‌ నందనవనం సబ్‌స్టేషన్‌లోని 11కేవీ ఫీడర్లు రోజకు కనీసం నాలుగైదు సార్లు ట్రిప్పవుతున్నాయి. ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పుడు ఫీడర్‌ ఆన్‌ చేయడం, ఆ తర్వాత కొద్ది సేపటికే మళ్లీ ట్రిప్పవడం ఇక్కడ పరిపాటిగా మారింది. లోపభూయిష్టమైన లైన్ల పునరుద్ధరణ పనులే ఇందుకు కారణమని తెలిసింది. సరూర్‌నగర్‌ డివిజన్, వనస్థలిపురంలోనూ విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు ఆయా ఏరియాలకు సంబధించిన లైన్‌మెన్లు, ఎఫ్‌ఓసీ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యటించి....లైన్ల పనితీరును స్వయంగా పర్యవేక్షించాల్సిన సంబంధిత ఇంజనీర్లు ఇవేవీ పట్టించుకోవడం లేదు.  

మరిన్ని వార్తలు