హైదరాబాద్‌లో మరోసారి భూప్రకంపనలు

22 Oct, 2017 07:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆదివారం తెల్లవారుజామున నగరం మరోసారి ఉలిక్కిపడింది. సిటీలోని బోరబండ, రహ్మత్‌ నగర్‌లతో పాటు, పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.

ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో ప్రకంపనల్ని గుర్తించిన ప్రజలు భయంతో బయటకు వచ్చారు. అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారికి ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాత్రి 11 గంటల సమయంలో ఒకసారి, అర్థరాత్రి 3గంటలకు మరోసారి కంపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లావారే వరకూ  బిక్కుబిక్కుమంటూ ఆరు బయటే గడిపారు.

శనివారం తెల్లవారుజామున కూడా స్వల్పంగా భూమి కంపించింది. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే రూట్‌లో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి. రహ్మత్‌నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ ప్రాంతాల్లో  భూమి స‍్వల‍్పంగా కంపించింది

భూ ప్రకంపనల భయంతో రాత్రంతా బయటే జాగారం చేసిన ప్రజలు 

మరిన్ని వార్తలు