నగరం తూర్పుకు నగిషీలు

14 May, 2018 01:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వరంగల్‌ జాతీయ రహదారి అభివృద్ధిపై హెచ్‌ఎండీఏ దృష్టి

మేడిపల్లి, ప్రతాపసింగారం లేఅవుట్ల అభివృద్ధి

 ఉప్పల్‌లో  మినీ శిల్పారామం ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని తూర్పు భాగానికి నగిషీలు దిద్దే పనికి హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నడుం బిగించింది. ‘లుక్‌ ఈస్ట్‌’ పేరిట రాజధాని శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మాదాపూర్‌లో శిల్పారామం తరహాలో ఉప్పల్‌లో మినీ శిల్పారామం నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ పక్కనే ఐదెకరాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ మినీ శిల్పారామం కోసం కేటాయించింది.

పల్లె అందాలు కళ్లకు కట్టేట్టు చూపడంతో పాటు ఆయా కులవృత్తుల తీరును భావితరాలకు తెలియజేసేలా శిల్పాలు ఏర్పాటు చేసే దిశగా పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. కళాకారుల కోసం ప్రత్యేక ఆడిటోరియం నిర్మిస్తోంది. వరంగల్‌  జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో మినీ శిల్పారామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనికితోడు ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు రూ.623 కోట్ల వ్యయంతో భారీ ఫ్లైఓవర్‌ నిర్మిస్తుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తొలగనున్నాయి. 

అత్యాధునిక సౌకర్యాలతో లే అవుట్లు..  
రియల్‌ ఎస్టేట్‌ జోరున్న ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను గుర్తించిన హెచ్‌ఎండీఏ.. వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలో భాగంగా మేడిపల్లిలోని 360 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో, ప్రతాపసింగారంలో 200 ఎకరాలను లే–అవుట్‌ చేయాలని భావించింది. మేడిపల్లి సర్వే నంబర్‌ 63లోని 360 ఎకరాల అసైన్డ్‌ భూములను తమకు అప్పగించాలని హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో టెండర్‌ ప్రక్రియ ద్వారా గుత్తేదారులను ఎంపిక చేసి త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేశారు.మాస్టర్‌ ప్లాన్‌ 2031కు అనుగుణంగా సొంత నిధులతోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడల్‌ లే–అవుట్లుగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

రహదారులు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, గ్రీనరీ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. లే–అవుట్‌ పూర్తయ్యాక భూములు అప్పగించిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను నష్టపరిహారంగా అందజేస్తారు. రైతులు ఆ ప్లాట్లను అమ్ముకోవచ్చు. లేదంటే ఉంచుకోవచ్చు. యజమానులకు కేటాయించగా మిగిలిన ప్లాట్లను హెచ్‌ఎండీఏ ఈ–వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటుంది. 12 ఏళ్ల క్రితమే ఉప్పల్‌ భగాయత్‌లో ల్యాండ్‌పూలింగ్‌కు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. అయితే ఆ భూములో కొన్ని వివాదాలు తలెత్తడంతో గతేడాది ఆగస్టులో ప్లాట్ల పత్రాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టుతో ఆయా గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. 

మౌలిక వసతుల కల్పన.. 
అటు వరంగల్‌ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. బీబీనగర్, పోచంపల్లి మండల కేంద్రాల్లోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు దాదాపు రూ.15 కోట్లు కేటాయించింది. ఘట్‌కేసర్‌ను అర్బన్‌ నోడ్‌ కింద అభివృద్ధి చేయడంలో భాగంగా గ్రామగ్రామానికీ మూడు, నాలుగు కిలోమీటర్ల రేడియస్‌లో అన్ని రోడ్లూ అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. భువనగిరి మున్సిపాల్టీలో సెంట్రల్‌ మీడియన్‌ నిర్మాణం, నాలుగు కిలోమీటర్ల మేర సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు తదితర పనులు కోసం రూ.15 కోట్లు మంజూరు చేసి పనుల వేగం పెంచింది.  
 
 

మరిన్ని వార్తలు